
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 55వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతుంది. ఈరోజు ఉదయం పాదయాత్రలో భాగంగా కియా పరిశ్రమ వద్దకు చేరుకున్న లోకేష్.. ఇది చంద్రబాబు నాయుడు ఘనత అని చెప్పారు. టీడీపీ హయాంలో కియాతో సహ అనేక పరిశ్రమలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ది.. ఇప్పుడు అభివృద్ది పూర్తిగా నిలిచిపోయిందని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించార. కియా పరిశ్రమ ముందు లోకేష్ సెల్ఫీ చాలెంజ్ విసిరారు.
‘‘కియా లోగో చూపినప్పుడు చాలా గర్వపడుతున్నాను. ఈరోజు లోగో చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. ఇంత పెద్ద బిల్డింగ్ మీకు కనిపిస్తుంది. దాని వెనక చాలా మంది కష్టం ఉంది. అధికారులు, అప్పుడు మంత్రిగా పనిచేసిన అమర్‌నాథ్, టీమ్ అంతా కష్టపడి దానిని తీసుకురావడం జరిగింది. రాష్ట్రానికి ఇంతా చేసినప్పటికీ 2019లో ఓడిపోవడం బాధ కలిగించింది. ఎవరూ ఊహించని విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాం, గ్రామాలను, పట్టణాలను అభివృద్ది చేశాం, ఇళ్లు కట్టించాం, సంక్షేమం చేశాం.. కానీ ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారనే బాధ కలిగింది. అయితే మేము చేసిన పనులను సరిగ్గా చెప్పుకోలేకపోయామని తర్వాత అర్థమైంది. సెల్పీ చాలెంజ్ వైరల్ అవ్వడానికి కారణం అదే. ఇన్ని పరిశ్రమలు వచ్చాయని చాలా మంది ప్రజలకు తెలియదు. పెనుకొండలో ఇన్ని కంపెనీలు వచ్చాయనేది లోకేష్‌కు కూడా తెలియదు. తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని.. చేసింది చెప్పుకోకపోవడమే తమ బలహీనత. పాదయాత్ర ద్వారా మేము చేసిన పనులను ప్రజలకు చెప్పే మంచి అవకాశం కలిగింది’’ అని లోకేష్ పేర్కొన్నారు. 4 ఏళ్లలో సీఎం జగన్ ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా?, గ్రౌండ్ చేశారా అనేది చూపించగలరా? అని ప్రశ్నించారు.
అదే విధంగా ట్విట్టర్‌లో కూడా లోకేష్ ఓ పోస్టు చేశారు. ‘‘ఇది కియా. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. భారతదేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. పెట్టుబడి: 13000 కోట్లు. ఉద్యోగాలు: 40,000 (ప్రత్యక్ష & పరోక్ష). ఇన్‌స్టాల్‌డ్ కెపాసిటీ: సంవత్సరానికి 4 లక్షల వాహనాలు. ఇలాంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకురావడం గురించి వైఎస్ జగన్ కలలో కూడా ఊహించలేరు’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.