
అమరావతి: చేయని నేరాన్ని మోపి పోలీసులు విచక్షణారహితంగా కొట్టారంటూ ఓ యువకుడు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అతడు ఇవాళ(శుక్రవారం) మరణించాడు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు.
''నంద్యాలలో చేయని నేరానికి దొంగ అనే ముద్ర వేసి వేధించి అబ్దుల్ సలామ్ కుటుంబాన్ని బలితీసుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు మరో మైనార్టీ సోదరుడు అలీషాని అన్యాయంగా చంపేసింది. గుంటూరు జిల్లా భట్రుపాలెంలో పక్కరాష్ట్రం నుంచి మద్యం తరలిస్తున్నారనే నెపంతో అలీషాని కొట్టి చంపేసిన జగన్‌రెడ్డి పోలీసుల కర్కశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను'' అన్నారు.
''అక్రమమద్యం తరలించడం కొట్టి చంపేంత నేరమైతే, విషపూరితమైన సొంత మద్యాన్ని అత్యధిక ధరలకు అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్‌రెడ్డిది ఇంకెంత పెద్ద నేరమో ఎక్సైజ్ పోలీసులు చెప్పాలి. అలీషా హంతకుల్ని ఉద్యోగాల నుంచి తొలగించాలి. అలీషా కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి. వైసీపీ సర్కారు దాడుల్నించి మైనారిటీలకు రక్షణ కల్పించాలి'' అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
read more అక్రమ మద్యం కేసు: గుంటూరులో యువకుడు ఆత్మాహత్యాయత్నం, చికిత్స పొందుతూ మృతి
గురువారం తెల్లవారుజామును కారులో వెళుతుండగా తమను పట్టుకుని చితకబాదడమే కాదు కారులో పోలీసులే మద్యం బాటిల్స్ పెట్టి అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారని బాధితుడు అలీషా ఆరోపించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురయిన అలీషా, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వీరిలో తాజాగా అలీషా మరణించాడు.
ఎక్సైజ్ పోలీసులు లాఠీలతో చితకబాదడంతో పాటు అక్రమ కేసులతో వేధించడం వల్లే అలీషా మరణించినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం బట్రుపాలెంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకుని బట్రుపాలెం గ్రామానికి చెందిన కొందరు రోడ్డుపై బైటాయించి పోలీసులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.