
అవినీతి అనేది తమ రక్తంలోనే లేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. చంద్రబాబు నాయుడు అరెస్ట్, తదితర పరిణామాలపై లోకేష్ సోమవారం మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు అరుదైన గుర్తింపు పొందిన వ్యక్తి అని చెప్పారు. ప్రజలు, రాష్ట్రం, దేశం తప్పించి మరేమి ఆయన ఆలోచించరని లోకేష్ అన్నారు. ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి గురించే ఆలోచిస్తారని.. చంద్రబాబు అంటేనే ఓ బ్రాండ్ అని స్వయంగా బిల్‌గేట్స్, బిల్‌క్లింటన్, 500 మంది సీఈవోలు చెబుతారని లోకేష్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబుపై దొంగ కేసు పెట్టి ఆయనను జగన్ ప్రభుత్వం జైలుకు పంపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌తో ప్రజల్లో ఎన్నడూ లేనంత స్పందన వచ్చిందని.. టీడీపీ బంద్‌లో ప్రజలే పాల్గొన్నారని చెప్పారు. బంద్‌లో పాల్గొన్న జనసేన, సీపీఎం, ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు జోలికి రావడం జగన్ చేసిన పెద్ద తప్పన్నారు.. దీనికి ఆయన అన్ని రకాలుగా మూల్యం చెల్లించుకుంటారని లోకేష్ హెచ్చరించారు. జగన్ దృష్టిలో అధికారమంటే కక్ష సాధింపులు, వేధింపులు, దొంగ కేసులు, హింస మాత్రమేనని ఆయన దుయ్యబట్టారు. పింక్ డైమండ్, వివేకా హత్య, కోడికత్తి కేసుల్లో ఎంత అబద్ధం వుందో.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులోనూ అంతే అబద్ధం వుందన్నారు. జగన్‌పై 38 కేసులు, 10 సీబీఐ, 7 ఈడీ కేసులు, 21 ఇతర కేసులు వున్నాయని లోకేష్ చెప్పారు.
ALso Read : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా
ఈ కేసులు పదేళ్ల నుంచి ట్రయల్ జరగడం లేదని.. జగన్ ఎంతగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్ట్ కాకుండా జగన్ కాపాడారాని లోకేష్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం అంతు తేల్చే వరకు తన పోరాటం కొనసాగుతుందని.. తాము ప్రకటించిన ఆస్తుల కంటే అదనంగా వుంటే ఇచ్చేస్తామన్నారు.
తెలుగుదేశం పార్టీకీ సంక్షోభాలు కొత్త కాదని.. ఇందిరా గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని.. జగన్ ఓ లెక్కకాదని నారా లోకేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో యువగళం పాదయాత్రకే బ్రేక్ ఇచ్చినట్లుగా ఆయన వెల్లడించారు. తమకు ప్రజాబలం వుందని.. స్పీడు బ్రేకర్లను తొక్కుకుంటూ ఎలా వెళ్లాలో తమకు తెలుసునని లోకేష్ వ్యాఖ్యానించారు.