
సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన బహిరంగసభలో లోకేష్ మాట్లాడారు. జయహో బీసీ కార్యక్రమం చూసి జగన్ వణికిపోయారని.. వైసీపీ నేతలతో తనను తిట్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు బీసీ బాలుడిని పెట్రోల్ పోసి తగులబెడితే వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు. జయహో బీసీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఉదయభానును కూడా ట్రోల్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ది సిగ్గులేని జన్మ అని.. ఒక్క బీసీ కుటుంబాన్ని కూడా ఆయన ఆదుకోలేదని లోకేష్ మండిపడ్డారు.
జగన్ బటన్‌కు పవర్ లేదని.. అమ్మఒడి బటన్ నొక్కి నెల రోజులు కావొస్తున్నా లబ్ధిదారుల ఖాతాల డబ్బులు పడలేదని దుయ్యబట్టారు. తల్లిని , చెల్లిని గెంటేసినవాడికి తల్లుల బాధ ఎలా తెలుస్తుందని లోకేష్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అమ్మఒడిపై కబుర్లు చెప్పి.. అధికారంలోకి వచ్చాక షరతులు వర్తిస్తాయని ఈ పథకానికి కత్తెరలు వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకిని గొట్టిపాటి రవికుమార్ అభివృద్ధి చేశారని.. సీసీ రోడ్లు, సాగునీటి పథకం, ఇండోర్ స్టేడియం, ఐటీఐ కాలేజ్ వంటివన్ని టీడీపీ హయాంలోనే వచ్చాయని లోకేష్ గుర్తుచేశారు. అలాంటి అద్దంకిని వైఎస్ జగన్ అనాథలా వదిలేశారని ఆయన దుయ్యబట్టారు.
Also Read : బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదు: పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి సెటైర్లు
పెద్ద సైకోని చూసి పిల్ల సైకోలు రెచ్చిపోతున్నారని...గుండ్లకమ్మ డ్యామ్‌కు గేట్లు కొట్టుకుపోయి ఏడాది కావొస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గేట్లు బిగిస్తే ఇసుకను దోచుకోవడం కుదరదని అందుకే వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. పిల్ల సైకోల చేష్టల కారణంగా 13 గ్రామాల మత్స్యకారులు రోడ్డునపడ్డారని.. ఎకరం రూ.10 లక్షలకు కొని, ప్రభుత్వానికి రూ.27 లక్షలకు అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.
2024లో గెలిచేది టీటీపీయేనని.. మన ప్రభుత్వ వచ్చాక అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతామని లోకేష్ ప్రకటించారు. పోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను జగన్ పూర్తి చేయలేదని.. టీడీపీ రాగానే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గుండ్లకమ్మ ముంపు గ్రామాల ప్రజలకు అన్ని వసతులతో కాలనీలు ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రస్తుతం వెంటిలేటర్‌పై వుందని.. ఇలాంటి పరిస్ధితుల్లో ఆ పార్టీ నేతలు సవాళ్లు విసురుతున్నారని ఆయన సెటైర్లు వేశారు.