విజయవాడలో కోర్టుకు హాజరైన నారా లోకేష్: ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని వెల్లడి..

By Sumanth KanukulaFirst Published May 23, 2022, 11:32 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో నారా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. ఆ సమయంలో  కరోనా నిబంధనలు ఉల్లంఘించారని నారా లోకేష్‌, కొల్లు రవీంద్రతో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నేడు నారా లోకేష్ వ్యక్తిగతంగా హజరవ్వాలని విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నారా లోకేష్ నేడు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. నారా లోకేష్‌తో పాటు టీడీపీ నేత కొల్లు రవీంద్ర కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు కోర్టు వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.  

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. 55 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. అందులో ఒక్క కేసు కూడా నిరూపించే పరిస్థితి లేదన్నారు. తనపై ఈ ప్రభుత్వం ఎన్నో ఆరోపణలు చేసిందని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలకు తాను చర్చరకు సిద్దంగా ఉన్నానని వెల్లడించారు.  ఇప్పుడు కోవిడ్ కేసు పెట్టారని అన్నారు. 

మూడేళ్ల సినిమా అయిపోయిందని.. జగన్ ఇక ఇంటికే అని అన్నారు. ప్రజలను ధరలు, పన్నుల పేరుతో పీడించి నరకం చూపించారని ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. తప్పు చేయలేదు కాబట్టే కోర్టుకు వచ్చానని చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలు ఉల్లంఘించి దొంగ కేసులు పెడతారా అని మండిపడ్డారు. 

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. సుబ్రహ్మణ్యం హత్యకు గురై 72 గంటలైనా నిందితులను పట్టుకోలేరా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నామని అన్నారు. 24 గంట్లో అనంతబాబును పట్టుకోకపోతే ఉద్యమిస్తామని చెప్పారు. సుబ్రహ్మణ్యం హత్య తర్వాత ఎమ్మెల్సీ అన్ని చోట్లకు వెళ్లారని లోకేష్ చెప్పారు. అనంతబాబు.. ప్రభుత్వ సలహాదారు సజ్జలను కూడా కలిశారని అన్నారు. పోలీసులకు మాత్రం అనంతబాబు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. 

click me!