టీడీపీలో నందిగామ టికెట్ లొల్లి: ఎమ్మెల్యే సౌమ్యకు కన్నెగంటి ఝలక్

Published : Feb 22, 2019, 04:48 PM IST
టీడీపీలో నందిగామ టికెట్ లొల్లి: ఎమ్మెల్యే సౌమ్యకు కన్నెగంటి ఝలక్

సారాంశం

 ఇకపోతే నందిగామ అభ్యర్థిత్వంపై చంద్రబాబు పునరాలోచించుకోవాలని టీడీపీ సీనియర్ నేత కన్నెగంటి జీవరత్నం సూచించారు. తనకు సీటు ఇవ్వాలని లేని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని హెచ్చరించారు.  

విజయవాడ: ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. అత్యంత జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. అదే సమయంలో అసంతృప్తులను శాంతింపజెయ్యడం పెద్ద తలనొప్పిగా మారింది. 

అభ్యర్థుల ఎంపికపైనే పార్టీ అధినేతలు మల్లగుల్లాలు పడుతుంటే తాజాగా అసంతృప్తులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. 

నందిగామ ప్రస్తుత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకే రాబోయే ఎన్నికల్లో టికెట్ కన్ఫమ్ కావడంతో టీడీపీలో ఒక్కసారిగా అసమ్మతి జ్వాల చెలరేగింది. సౌమ్యకు టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు నిరసనబాట పట్టారు. 

శనివారం నుంచి రిలే నిరాహార దీక్షలు చెయ్యనున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే సౌమ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ నాలుగు మండలాలకు చెందిన టీడీపీ అసంతృప్తవాదులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీ సీనియర్ నేత ప్రముఖ వ్యాపారి మురళి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

2014 ఎన్నికల తర్వాత తంగిరాల ప్రభాకరరావు మరణానంతరం ఆయన కుమార్తె సౌమ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో 2019లో ప్రముఖ న్యాయవాది, జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు కన్నెగంటి జీవరత్నంకు అవకాశం ఇస్తామని టీడీపీ అధిస్ఠానం చెప్పుకొచ్చింది. 

అయితే అనూహ్యంగా తంగిరాల సౌమ్యనే తిరిగి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన వర్గీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరోవైపు టీడీపీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన తమను  ఎమ్మెల్యే సౌమ్య పట్టించుకోలేదని టీడీపీ నేత వేల్పుల రమేష్ ఆరోపించారు. 

ఎమ్మెల్యే అండదండలతో కొంత మంది నేతలు తమను ఇబ్బందుల పాల్జేశారని తమపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కంచికర్ల ఎంపీపీగా తన భార్య ప్రశాంతి పట్ల ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. 

కుట్రతో తన భార్యను పదవి నుంచి దింపారని ఆరోపించారు. ఇకపోతే నందిగామ అభ్యర్థిత్వంపై చంద్రబాబు పునరాలోచించుకోవాలని టీడీపీ సీనియర్ నేత కన్నెగంటి జీవరత్నం సూచించారు. తనకు సీటు ఇవ్వాలని లేని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని హెచ్చరించారు.  

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu