దళిత మేధావి సుధాకర్ ను పిచ్చోడిలా చిత్రీకరిస్తున్నారు: కాల్వ

By telugu team  |  First Published Jun 1, 2020, 3:45 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్లంపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు నిప్పులు చెరిగారు. విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి జగన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆయన అన్నారు.


అమరావతి: వైసీపీ ఏడాది పాలనంతా కూల్చివేతలు, రద్దులతోనే గడిచిపోయిందని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసినట్టు వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం బలిపీఠంపై ఉందని ఆయన సోమవారం అన్నారు. వెనుకబడిన తరగతుల వారికి ఆర్థిక చేయూత అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్  అధికారంలోకి వచ్చాక మాట తప్పారని అన్నారు. 

టీడీపీ హయాంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్లు ఆపేశారని, కార్పొరేషన్లు పూర్తిగా పడకేశాయని ఆయన అన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అని పేర్లు పెట్టారే కానీ ఫలితం మాత్రం నామమాత్రమని ఆయన అన్నారు. ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో లాగేసుకున్నారని కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. 

బలహీన వర్గాల స్వయం ఉపాధి కోసం ఈ ఏడాదిలో ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి కనుసన్నల్లోనే పాలన నడుస్తోందని అన్నారు. రాజకీయ నిర్ణయాల్లో, సంక్షేమ కార్యక్రమాల అమల్లో బలహీన వర్గాలకు భాగస్వామ్యం కరువైందని అభిప్రాయపడ్డారు. బలహీన వర్గాలు ఉపాధి కరువై భయాందోళనతో రోజులు గడుపుతున్నారని చెప్పారు. 

Latest Videos

undefined

మెరుగైన సమాజం తీసుకొస్తానని పాదయాత్రలో గొప్పలు చెప్పారని అంటూ జగన్మోహన్ రెడ్డి. బీసీ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి సబ్సిడీ ఇచ్చారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఎందరికి రుణం ఇచ్చారని అడిగారు.   3,800 కోట్లు పైగా రాయితీ రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఎంతమందికి రుణమిచ్చారని ప్రశ్నించారు. కార్పొరేషన్లు పనిచేయడం లేదని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు తప్పించి రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని అన్నారు. రాజకీయంగా బీసీలు, దళితులు, మైనారిటీలను అణగదొక్కేస్తున్నారని విమర్శించారు. 

స్థానిక సంస్థల్లో  రిజర్వేషన్ల శాతం తగ్గిస్తే బీసీల నాయకత్వం ఎలా బలపడుతుందో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాల్వ శ్రీనివాసులు నిలదీశారు. నామినేటెడ్ పోస్టుల్లో సగానికి పైగా బీసీలకు అవకాశం ఇస్తామన్నారని అంటూ ప్రభుత్వ సలహాదారుల్లో ఎంతమంది బీసీలున్నారో చెప్పాలని అడిగారు. 

వర్సిటీ వీసీలు, టీటీడీ చైర్మన్ సహా ప్రధాన పదవులు ఎవరికికట్టబెట్టారని ఆయన అడిగారు. కీలక పదవులన్నీ జగన్మోహన్ రెడ్డి బంధువులు, ఆయన సామాజిక వర్గం వారి చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు.. బీసీల నాయకత్వాన్ని ఎక్కడ ప్రోత్సహించారో చెప్పాలని ఆయన అడిగారు.. ప్రత్యర్థి పార్టీల్లో పనిచేసే బీసీ నాయకులే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా కేసులు పెడుతున్నారని, అన్నారు. 

దళిత మేధావి సుధాకర్ ను పిచ్చోడిగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే బాధేస్తోందని, బలహీన వర్గాలను తొక్కేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాల్వ శ్రీనివాసులు అన్నారు. టీడీపీ హయాంలో బీసీల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఆదరణ-2 పథకాన్న ఎందుకు నిలుపుదల చేశారని అడిగారు. రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీలు. చేనేతల సంఖ్య ఎంతో లబ్ధి పొందుతున్న వారి సంఖ్య ఎంతో ఈ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ప్రజలకు ప్రభుత్వ లబ్ధి గోరంత, ప్రచారం కొండంతగా ఉందని అన్నారు. వాలంటీర్ల పోస్టులు ఇచ్చినంత మాత్రాన బడుగులు బాగుపడతారా అని ప్రశ్నించారు. బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారని, మరి ఈ ఏడాది నేరుగా బీసీలకు అందించిన సాయమెంతో ఈ ప్రభుత్వం చెప్పాలని అన్నారు. టీడీపీ హయాంలో బీసీల సంక్షేమానికి రూ. 42 వేల కోట్లు, దళితుల కోసం రూ. 40 వేల కోట్లు, గిరిజనుల కోసం రూ. 12 వేల కోట్లు, మైనారిటీల కోసం 4 వేల కోట్లు, కాపులకు రూ. 4 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. 

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో 2 లక్షల కోట్ల రూపాయలు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపుల సంక్షేమానికి అందించామని, సంక్షేమ రంగానికి సమాధి కట్టారు. రాజకీయ లబ్ధి కోసం బలహీన వర్గాలను బలిపశువులుగా మారుస్తున్నారని ఆయన అన్నారు.. బీసీ కార్పొరేషన్ కు కేటాయించిన రూ. 3432 కోట్లు, .కాపు కార్పొరేషన్ నుంచి  568 కోట్ల నిధులను , ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ. 3,000 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ నుంచి రూ. 267 కోట్ల నిధులను దారి మళ్లించారని విమర్శించారు.  

స్వయం ఉపాధి కోసం వెచ్చించిన నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించడమంటే ఆయా కార్పొరేషన్ల లక్ష్యాలను దెబ్బతీయటమేనని కాల్వ శ్రీనివాసులు అన్నారు . దళితులకు ఏడాదిలో ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారని అడిగారు. జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పిందొకటి అధికారంలోకి వచ్చాక చేస్తోంది ఒకటని ఆయన మండిపడ్డారు. రూ.45 ఏళ్లకే అక్కచెల్లెళ్లకు పింఛను ఇస్తామని మాట తప్పారని అన్నారు. ఏటా రూ.15 వేలు ఇస్తామని అబద్దాలు చెప్పారని అన్నారు.  డ్వాక్రా సంఘాలకు దశలవారీ రుణమాఫీ అని మడమ తిప్పారని విమర్శించారు. నమ్మిన ప్రజలను నట్టేట ముంచారని వ్యాఖ్యానించారు.. విదేశీవిద్యకు డబ్బు ఇవ్వడం లేదని అన్నారు. 

ప్రభుత్వ విద్యావిధానం వల్ల యువత నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని కాల్వ శ్రీనివాసులు అన్నారు.  బీసీలను అణిచివేస్తూ కీలకమైన స్థానాల్లో వారికి స్థానం లేకుండా చేయడం వల్లే బీసీల భాగస్వామ్యం నామమాత్రంగా తయారైందని అన్నారు.  మొదటి స్థానంలో జగన్ రెండో స్థానంలో విజయసాయి కనిపిస్తున్నారని అన్నారు. ఇప్పుడా స్థానానికి సజ్జల రామకృష్ణా రెడ్డి పోటీపడుతున్నారని అన్నారు. అప్పుడప్పుడు పెద్ది రెడ్డి , బుగ్గన కనిపిస్తున్నారని చెప్పారు. వివాదాస్పద అంశాలుంటే బొత్స ముందుకొస్తున్నారని చెప్పారు. ఇంతకు మించి ఈ ప్రభుత్వంలో ఏ బీసీ నేతైనా కనిపిస్తున్నారా అని అడిగారు. 

టీడీపీ హయాంలో చంద్రబాబు తర్వాత యనమల, కేఈ వంటి బీసీ ఉద్దండులు ప్రభుత్వ విధానాల నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు.  లాక్ డౌన్ సమయంలో పేదలు, కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రాలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడుగుల పట్ల అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు.

click me!