
జేబ్రాండ్స్ తాలూకా మద్యం సీసాల్లోని మద్యం శాంపిళ్లను కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన ల్యాబ్‌లకు పంపి పరీక్షలు చేయించారని చెప్పారు టీడీపీ (tdp) ఎమ్మెల్సీ నారా లోకేష్ (nara lokesh). శాసనమండలి సమావేశాల (ap legislative council session) నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేబ్రాండ్స్ లోని బ్రాండ్లలో కేవలం 5, 6 బ్రాండ్లనే పరీక్షిస్తే, మనుషులు తాగడానికి అవేవీ పనికిరావని తేలిపోయిందన్నారు. ల్యాబ్‌లు ఇచ్చిన నివేదికలను తాము ఛైర్మన్‌కి అందివ్వాలని నిర్ణయించామని లోకేష్ తెలిపారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు కూడా ఆయా ఆధారాలు అందించారని పేర్కొన్నారు. ఇవన్నీ గమనించాకే ఉభయసభల్లో తాము సారా మరణాలపై చర్చకు పట్టుబడితే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎందుకు పారిపోతున్నారని నారా లోకేష్ ప్రశ్నించారు.
గత ఆరు రోజుల నుంచీ సారా మరణాలపై చర్చించాలని పట్టుబడుతుంటే, 6 నిమిషాలు కూడా ఎందుకు అవకాశమివ్వలేదని ఆయన నిలదీశారు. సారా మరణాలు సహజ మరణాలు కాదనే వాస్తవాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భయపడుతోందా అని నారా లోకేష్ మండిపడ్డారు. తమవారిని కోల్పోయిన ఆడబిడ్డలు కన్నీళ్లతో, తమవారు ఎలా కళ్లముందు వివిధ సమస్యలతో చనిపోయారో చెప్పుకుంటూ బోరున విలపిస్తుంటే, ఈ ప్రభుత్వం సహజ మరణాలని ఎలాచెబుతుందని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి , ఈ ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్‌లో మద్యంలో ఎలాంటి ప్రమాదకర రసాయనాలు లేవంటున్నారని నారా లోకేష్ చెప్పారు.
అసలు ఆ రిపోర్ట్ ఏమిటో.. ఎక్కడుందో సభలో ప్రవేశపెట్టాలి కదా.. సభ్యులకు చూపించాలికదా అని ఆయన డిమాండ్ చేశారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ వారి నిబంధన ప్రకారం ఏ శాంపిల్‌ను అయినా .. ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపించాలని లోకేష్ చెప్పారు. అలా ఈ ప్రభుత్వం మద్యం శాంపిళ్లను పరీక్షలు చేయించిందా అని లోకేష్ ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి.. మంత్రులు ఎంత మెంటల్ గాళ్లో ఈ రోజు చూశామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభలో మండలి సభ్యుడినైన నన్నుపట్టుకొని ఉపముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తిడుతుంటే, ముఖ్యమంత్రి ముసిముసినవ్వులు నవ్వుతాడా? ఆయనతోపాటు స్పీకర్ కూడా నవ్వారని లోకేష్ మండిపడ్డారు.
సిగ్గులేని ఇలాంటి వాళ్లు ఉండబట్టే .. ఈ రాష్ట్రానికి ఇలాంటి గతిపట్టిందని, జగన్మోహన్ రెడ్డి తనకూతుళ్లకు కూడా ఇలాంటి సంస్కారమే నేర్పిస్తున్నాడా అని ఆయన ఫైరయ్యారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టమని... నాటుసారా మరణాలతో పాటు, జేబ్రాండ్స్ మద్యం అమ్మకాలతో ప్రజలను దారుణంగా దోచుకుంటున్న ముఖ్యమంత్రిని ప్రజల్లోదోషిగా నిలబెడతామని నారా లోకేష్ స్పష్టం చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదు. తమవద్ద ఉన్నఆధారాలన్నింటినీ ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. మంత్రులు బొత్స సత్య నారాయణ , కొడాలి నానీ మండలిలో టేబుళ్లు ఎక్కి, నోటికొచ్చినట్లుగా ఛైర్మన్ స్థానంలో ఉన్న షరీఫ్‌ని అవమానించారని లోకేష్ గుర్తుచేశారు.
షరీఫ్‌ని బొత్స సత్యనారాయణ ఏకంగా కులం పేరుతోనే తిట్టారని, ఆయన తల్లిని అనకూడని మాటన్నారని ఆరోపించారు. ఛైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తిని గౌరవంగా అధ్యక్షా అనే పిలుస్తున్నామని లోకేష్ అన్నారు. మాకు ఓపిక ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. సారా మరణాలు.. ముఖ్యమంత్రి సాగిస్తున్న మద్యం వ్యాపారాన్ని వదిలిపెట్టేదిలేదని నారా లోకేష్ స్పష్టం చేశారు.