టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర అరెస్టు, బాపట్లకు తరలింపు

By telugu team  |  First Published Apr 23, 2021, 7:47 AM IST

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు ఈ రోజు తెల్లవారు జామున అరెస్టు చేశారు. ఆయనను బాపట్లకు తరలించినట్లు సమాచారం. కారణం చెప్పకుండా నరేంద్రను అరెస్టు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసి బాపట్లకు తరలించినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారు జామునే నరేంద్ర ఇంటి వద్ద వంద మందికి పైగా పోలీసులు మోహరించారు. 

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్రను ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు. కారణం చెప్పకుండా నరేంద్రను అరెస్టు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తెలియక నరేంద్ర కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు. 

Latest Videos

ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. సంగం డెయిరీలో అవకతవకలపై ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ విషయంపై విచారణ నిమిత్తం నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు.

ధూళ్లిపాళ్ల నరేంద్రపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. నరేంద్ర అరెస్టును అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కారులో ఎక్కించుకుని ఆయనను తీసుకుని వెళ్లారు. చింతలపూడిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టి ఆయనను అక్కడి నుంచి తరలించారు.

నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తన నోటీసులో చెప్పింది. 

నరేంద్రను అరెస్టు చేయడం దుర్మార్గమైన విషయమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని ఆయన అన్నారు. కేసు ఏమిటో తెలియదని, విషయం చెప్పకుండా అరెస్టు చేశారని, ఇది దారుణమని ఆయన అన్నారు. తప్పు చేస్తే నోటీసు ఇవ్వాలని ఆయన అన్నారు. నేరం ఏమిటో తెలియదని ఆయన అన్నారు. కోర్టులో ఉన్న విషయం మీద ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అరెస్టు చేయకపోతే ప్రపంచం బద్దలైపోతుందా అని ఆడిగారు. కరోనా విలయతాండవం చేస్తుంటే, వందల మంది పోలీసులు ఇంట్లోకి వెళ్లి అరెస్టు చేయడం ఈ సమయంలో అవసరమా అని అడిగారు. 

కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విమర్శలు చేస్తున్నందు వల్లనే అరెస్టు చేశారని ఆయన అన్నారు. వైఎస్ జగన్ మీద ఎవరు విమర్శలు చేస్తే వారిని అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. దొంగలం, బందిపోట్లం కాదని, నోటీసులు ఇస్తే సమాధానం చెప్తామని ఆయన అన్నారు. ఈ సంఘటనపై ఏం చేయాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు చెప్పారు.

 

click me!