నారా భువనేశ్వరి ఆవేదనను సజ్జల అవహేళన చేయడం బాధాకరం.. : బుద్దా వెంకన్న

By Sumanth KanukulaFirst Published Oct 15, 2023, 3:46 PM IST
Highlights

చంద్రబాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష సాధిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి గత 36 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారని విమర్శించారు. జైలు అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని అన్నారు. 

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే విషయంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.  వ్యవస్థలను మేనేజ్ చేసి గత 36 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారని విమర్శించారు. జైలు అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని అన్నారు. 

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అవహేళన చేయడం బాధాకరమని బుద్దా వెంకన్న అన్నారు. సజ్జలకు చంద్రబాబు కుటుంబ సభ్యులను విమర్శించే అర్హత లేదని అన్నారు. సజ్జల ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారం ఉందని హద్దుమీరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అక్రమాలను బయటపెడతామని అన్నారు. 

అదే సమయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై కూడా బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ప్యాకేజీ లీడర్ అని ఆరోపించారు. సీఎం జగన్ దగ్గర ప్యాకేజి తీసుకొని చంద్రబాబు పై కేసులు వేస్తున్నారని విమర్శించారు. నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర ప్యాకేజిలు తీసుకున్న ఘనత ఉండవల్లి అరుణ్ కుమార్‌కు చెల్లుతుందని అన్నారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, కొడాలి నానిలకు పిచ్చి పరాకాష్టకు చేరిందని బుద్దా వెంకన్న విమర్శించారు. అర్జెంట్‌గా ర్యాబిస్ ఇంజక్షన్ చేయాలని అన్నారు. చంద్రబాబుకు హాని జరిగితే చూస్తూ ఊరుకోమని.. ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. 

click me!