విశాఖను దోచుకుంటూ... జనాన్ని రాబందుల్లా పీక్కుతింటున్నారు, జగన్ స్పందించరా : బొండా ఆగ్రహం

By Siva KodatiFirst Published Oct 13, 2022, 3:25 PM IST
Highlights

విశాఖలో వైసీపీ నేతలు భూములకు కబ్జాకు పాల్పడుతున్నారని.. జనాన్ని రాబందుల్లా పీక్కుతింటున్నారని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సీఎంకు చిత్తశుద్ధి వుంటే.. విశాఖను కాపాడాలని.. అక్కడి ప్రజలకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు

విశాఖలో దస్‌పల్లా భూముల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలోని అధికార , ప్రతిపక్షనేతల మధ్య దీనిపై మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు స్పందించారు. విశాఖను వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, ఇతర నేతలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చివరికి భూ యజమానులను కూడా రాబందుల్లా పీక్కుతింటున్నా జగన్ స్పందించడం లేదని బొండా ఉమా మండిపడ్డారు. దస్‌పల్లా భూములను విజయసాయిరెడ్డి, కూర్మన్నపాలెంలోని స్థలాన్ని ఎంవీవీ సత్యనారాయణ, మధురవాడ ఎన్సీసీ భూముల్ని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తమ్ముడు కాజేశాడని ఆయన ఆరోపించారు. 

డేటా సెంటర్‌కు గత ప్రభుత్వం కేటాయించిన రూ.600 కోట్ల భూమిని, హయగ్రీవా వృద్ధాశ్రమానికి చెందిన రూ.400 కోట్లు, బే పార్క్, రాడిసన్ హోటల్, భీమిలి బీచ్ రోడ్‌లోని నేరెళ్లవలసలోని రూ.100 కోట్ల భూమిని కబ్జా చేశారని బొండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. తనంతట తానుగా విజయసాయిరెడ్డి విచారణ ఎందుకు కోరారని బొండా ప్రశ్నించారు. సీఎంకు చిత్తశుద్ధి వుంటే.. విశాఖను కాపాడాలని.. అక్కడి ప్రజలకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో విశాఖ ఆర్ధిక నగరంగా విలసిల్లితే.. వైసీపీ హయాంలో ఈ మూడున్నరేళ్లలోనే రూ.40 వేల కోట్లు కొట్టేశారని బొండా ఆరోపించారు. ఇంత జరుగుతున్నా మేధావులు, ప్రజా సంఘాలు ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. 

Also Read:దసపల్లా భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు: విజయసాయి

అంతకుముందు సోమవారం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... దసపల్లా భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేశామన్నారు. ఉత్తరాంధ్రకు ద్రోహంచేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 400 కుటుంబాలకు మేలు జరుగుతుందని విజయసాయి రెడ్డి చెప్పారు.  ప్రైవేట్ భూమిని 22 ఏ నుండి తీసేస్తే తప్పేం ఉందని ఎంపీ ప్రశ్నించారు.  విశాఖపట్టణానికి పరిపాలన రాజధాని రాకుండా కుట్రలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వికేంద్రీకరణపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని  ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో కాపులు,వెలమలు,  యాదవులు, కళింగులు ఎక్కువగా ఉన్నారన్నారు. కానీ భూములు  మాత్రం చంద్రబాబు సామాజిక వర్గం చేతిలో ఉన్నాయని విజయసాయిరెడ్డి  విమర్శించారు.
 

click me!