ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేస్తూ ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకున్న జగన్ సర్కార్

By Sumanth KanukulaFirst Published Oct 13, 2022, 2:34 PM IST
Highlights

ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేస్తూ ఇచ్చిన జీవోలను ఏపీ సర్కార్ ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు వివరాలు సమర్పించింది. 

ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేస్తూ ఇచ్చిన జీవోలను ఏపీ సర్కార్ ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు వివరాలు సమర్పించింది. వివరాలు..  ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉపసంహరణకు ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న మొత్తం పది కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవో ఇవ్వగా, దానిని సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అలాగే ప్రజాప్రతినిధులపై కేసులను ఉపసంహరించుకునేందుకు సంబంధిత హైకోర్టుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసిన సుప్రీంకోర్టు మార్గదర్శకాల దృష్ట్యా హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.

ఈ క్రమంలోనే కేసులను ఉపసంహరించుకునేందుకు జారీ చేసిన తొమ్మిది జీవోలపై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణను సవాలు చేస్తూ దాఖలైన ఇతర పిటిషన్లను కూడా హైకోర్టు ట్యాగ్ చేసింది. హైకోర్టు అనుమతి లేకుండా ప్రజాప్రతినిధులపై కేసులు ఎలా ఉపసంహరిస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు జారీ చేసిన అన్ని జీవోలను ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మొత్తం తొమ్మిది  జీవోలను ఉపసంహరించుకోవడానికి ఇప్పటికే జీవో జారీ చేయబడిందని.. వివరాలను మెమో రూపంలో సమర్పించడానికి సమయం కోరింది.

తాజాగా విచారణ సందర్భంగా ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేతకు సంబంధించిన వివరాలను ఏపీ సర్కార్ ప్రభుత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి దాఖలైన పిల్‌ను మూసివేస్తున్నట్టుగా హైకోర్టు తెలిపింది. 

click me!