టీడీపీలోకి పార్థసారథి .. సహకరించేది లేదంటోన్న బోడే ప్రసాద్ వర్గం, పెనమలూరు రాజకీయం గరం గరం

By Siva KodatiFirst Published Jan 10, 2024, 4:02 PM IST
Highlights

ఈ నెల 18న గుడివాడలో చంద్రబాబు నాయుడు ‘‘ రా కదిలి రా’’ బహిరంగ సభ జరగనుంది. అన్నీ అనుకూలంగా జరిగితే అదే వేదిక మీదే పార్థసారథి తెలుగుదేశం జెండా కప్పుకోనున్నారు. అయితే కొలుసు రాకను టీడీపీ నేత, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వ్యతిరేకిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టికెట్ దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీ కానీ, టీడీపీ కానీ ఇందుకు అతీతం కాదు. ఈ క్రమంలో మాజీ మంత్రి, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్‌పై వైసీపీ అధిష్టానం నుంచి ఆయనకు స్పష్టమైన హామీ లభించకపోవడంతో పార్థసారథి అలకబూనారు. హైకమాండ్ బుజ్జగించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన మెత్తబడలేదు. 

ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మరో నేత బొమ్మసారి సుబ్బారావులు పార్థసారథితో భేటీ అయ్యారు. ఆయనను టీడీపీలోకి ఆహ్వానించగా పార్థసారథి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 18న గుడివాడలో చంద్రబాబు నాయుడు ‘‘ రా కదిలి రా’’ బహిరంగ సభ జరగనుంది. అన్నీ అనుకూలంగా జరిగితే అదే వేదిక మీదే పార్థసారథి తెలుగుదేశం జెండా కప్పుకోనున్నారు. 

Latest Videos

అయితే కొలుసు రాకను టీడీపీ నేత, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వ్యతిరేకిస్తున్నారు. పార్థసారథికి టికెట్ కేటాయిస్తే సహకరించేది లేదంటున్నారు. ఈ మేరకు తన వర్గంతో బోడే ప్రసాద్ సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుగు మీడియాలో కథనాలు వస్తున్నాయి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తాము రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించామని, పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు జెండా మోసిన తనను పక్కనబెట్టాలని చూడటం కరెక్ట్ కాదని బోడే ప్రసాద్ అనుచరులతో తన ఆవేదన వెళ్లబోసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు.. పెనమలూరు టీడీపీలో వర్గ విభేదాలు సైతం తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, చలసాని వెంకటేశ్వరరావు మేనల్లుడు దేవినేని గౌతమ్‌లు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఎవరికి వారే అన్నట్లుగా వుండటంతో చంద్రబాబు సైతం మరో బలమైన అభ్యర్ధిని బరిలో దించాలని భావిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు అనూహ్యంగా కొలుసు పార్థసారథి టీడీపీలోకి చేరుతుండటం గమనార్హం. మరి పెనమలూరు నుంచి ఎవరు పోటీ చేస్తారో చూడాలి. 

click me!