జగన్ మాటలకు, చేతలకు పొంతన లేదు: టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి

By telugu teamFirst Published Aug 23, 2021, 7:19 PM IST
Highlights

టిడ్కో ఇళ్లను ఇంకా లబ్దిదారులకు ఇవ్వకపోవడాన్ని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తే టీడీపీ చీఫ్ చంద్రబాబుకు పేరు వస్తుందనే దడ ప్రభుత్వంలో ఉన్నదని, అందుకే ఇళ్లను అందించడం లేదని ఆరోపించారు.
 

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదని విమర్శించారు. ఏపీ టిడ్కో కింద నిర్మాణం పూర్తయిన ఇళ్లనూ ఇంకా లబ్దిదారులకు ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఏపీ టిడ్కో కింద పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలనుకున్నామని వివరించారు. కానీ, జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వాటిని ఇంకా లబ్దిదారులకు ఇవ్వడం లేదన్నారు. ఇస్తే ఎక్కడ చంద్రబాబుకు పేరు వస్తుందోననే భయం వారిలో ఉన్నదని ఆరోపించారు. వాటిని ఉచితంగా ఇస్తామని చెప్పి రెండేళ్లయినా ఇంకా అందించడం లేదని చెప్పారు. ఇప్పటికీ చాలా ఇళ్లు పూర్తయ్యాయని, క్రమంగా అవి పాడైపోతూ ఉన్నాయని వివరించారు. ఇంకా కేవలం పదిశాతం పనులే మిగిలి ఉన్నాయన్నారు. అగ్రిగోల్డ్ భూములు అమ్మి ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పడం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. 

టీడీపీపై ఆయన విమర్శలు చేయడం హేయమని మూర్తి అన్నారు. అర్బన్ ఏరియాల్లో పేదలను చూపి భూములు దోచుకున్నదెవరో అందరికీ తెలుసు అని ఆరోపించారు. అర్బన్ ఏరియాలో స్థలం చూపిస్తే ఇళ్లు కట్టడానికి 20 వేల మంది లబ్దిదారులను తమ హయాంలో ఎంపిక చేశామన్నారు. అంతేకాదు, ఒక్కో లబ్దిదారునికి ఇళ్ల నిర్మాణానికి రూ. 2.50 లక్షలను కేటాయించామనీ తెలిపారు. తాజాగా, ఆ మొత్తాన్ని కుదించి అర్బన్ ఏరియాల్లో రూ. 1.80 లక్షలను మాత్రమే ఇస్తామని జగన్ ప్రభుత్వం చెబుతున్నదని, ఇది సామాన్యులను వంచించడమేనని విమర్శించారు. అర్బన్ ఏరియాల్లో ఇళ్లు ఎలా పూర్తి చేస్తారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ. 320 కోట్ల బకాయిలున్నాయని మూర్తి వివరించారు. కానీ, ‘విశాఖ’కు రావాల్సిన రూ. 420 కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. కార్పొరేషన్ ఫండ్ దారి మళ్లుతుంటే మేయర్ లేదా డిప్యూటీ మేయర్ ఎందుకు నోరు మెదపట్లేదని నిలదీశారు. స్టాంప్స్ అండ్ డ్యూటీస్ కింద రావాల్సిన మొత్తం ఏది అని అడిగారు. ఎస్సీ కాంపొనెంట్ మొత్తం రానేలేదని తెలిపారు. స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు దారిమళ్లిస్తారా? అని ప్రశ్నించారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు రావాల్సిన రూ. 1600
కోట్లను దారి మళ్లించారని అన్నారు. రెండేళ్లలో విశాఖను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

click me!