జాగ్రత్త... జగన్ రెడ్డి కుటుంబ చరిత్ర అలాంటిది: ఐఎఎస్, ఐపిఎస్ లకు అచ్చెన్న హెచ్చరిక

By Arun Kumar PFirst Published Aug 18, 2021, 1:31 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేస్తున్న ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు జాగ్రత్తగా వుండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

గుంటూరు: రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ఓవైపు ప్రజా సంపద లూటీ అవుతుంటే మరోవైపు చట్టధిక్కరణ చర్యలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అచ్చెన్న అన్నారు. 

''రాష్ట్రంలో బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు. నేరస్తులకు సరైన శిక్షలు పడటం లేదు. బాధితులకు న్యాయం చేయమని కోరిన వారిపైనా, బాధితులను పరామర్శించే వారిపైనా అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం కాదా? పోలీసు అధికారులు రాజకీయ ఒత్తిడులకు లోనై చట్టాలకు, న్యాయానికి విరుద్ధంగా ఏకపక్షంగా వెళితే సమస్యల్లో పడతారు'' అచ్చెన్న హెచ్చరించారు. 

''గతంలో జగన్ రెడ్డి తండ్రి ఆదేశాలను గుడ్డిగా అనుసరించి చట్ట వ్యతిరేక పనులు చేసిన కొంతమంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు అగౌరవం పాలు అవడమే కాకుండా జైళ్లకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. నేడు జగన్ రెడ్డి పాలనలో కూడ రెండున్నరేళ్లలోనే ఇప్పటికే కొందరు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు అటు కేంద్రం... ఇటు హైకోర్టు, ఎన్జీటి ల ముందు తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డులు, రివార్డులు పొందిన అధికారులే నేడు అదే కేంద్రం దగ్గర, కోర్టుల్లోను తలవంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది... ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందో ఆలోచించుకోండి'' అని సూచించారు. 

read more  కర్నూలు: నారా లోకేశ్ కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణుల యత్నం.. ఉద్రిక్తత

''ఇండియా టుడే సర్వేలను చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను చూస్తున్నారు. వైసీపీ నేతల లూఠీని చూస్తున్నారు. లూఠీ కోసం రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టింది చూస్తున్నారు. జగన్ రెడ్డి అధికారం శాశ్వతం కాదు. కాబట్టి నమ్ముకోవాల్సింది వైసీపీ నేతలను కాదు. ప్రజలను, చట్టాలను నమ్ముకుని గౌరవప్రదంగా జీవించండి'' అని ఐపిఎస్, ఐఎఎస్ లకు సూచించారు.

''కేవలం పోస్టింగుల కోసం కొందరు అధికారులు చట్టాలను అతిక్రమించి గుడ్డిగా వైసీపీ నేతల డిక్టేషన్ ను ఫాలో అవుతున్నారు. ఇలా చేసి మీ గౌరవానికి, వృత్తి ధర్మానికి నష్టం కల్పించుకోవద్దని విజ్ఝప్తి. చట్టాలకు కట్టుబడి ప్రజలకు న్యాయం చేయండి. ప్రజాసంపదను రక్షించి బాధితులకు అండగా నిలవండి. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా వ్యవహరించండి. లేకుంటే మీరు కూడా ప్రజా నిరసనను ఎదుర్కోక తప్పదు'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

 
 

click me!