మూడు రాజధానులపై నమ్మకం ఉంటే.. జగన్ అసెంబ్లీని డిజాల్వ్ చేయాలి: అచ్చెన్నాయుడు

By Sumanth KanukulaFirst Published Oct 10, 2022, 1:07 PM IST
Highlights

వికేంద్రీకరణ పేరుతో వైసీపీ విధ్వంసం చేస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అనేక చర్చల తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుచేసుకోవాలని కోరారు.

వికేంద్రీకరణ పేరుతో వైసీపీ విధ్వంసం చేస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అనేక చర్చల తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుచేసుకోవాలని కోరారు. అన్ని ప్రాంతాల అభివృద్ది చెందాలని ప్రణాళికబద్దంగా ముందుకు సాగామని చెప్పారు. 5 కోట్ల మంది ప్రజలు అమరావతిని రాజధానిగా భావిస్తున్నారని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి.. వికేంద్రీకరణ రాగం అందుకున్నారని ఆరోపించారు. 

మూడు రాజధానులపై ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. అధికారం లేని విషయాన్ని చర్చకు తీసుకొచ్చి.. ప్రజల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. రాజధాని గురించి మాట్లాడుతున్న మంత్రులకు విశ్వసనీయత లేదని విమర్శించారు. వికేంద్రీకరణ అంటే మూడు ముక్కలాట కాదని అన్నారు. 

Latest Videos

అమరావతితో అభివృద్ది వికేంద్రీకరణ జరగదని అబద్దాలు చెబుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అభివృద్ది వికేంద్రీకరణ అంటే ఏమిటో చంద్రబాబు నాయుడు చేసి చూపించారని చెప్పారు. ఎన్టీఆర్ పరిపాలన వికేంద్రీకరణకు నాంది పలికారని తెలిపారు. వైసీపీ నాయకులు గతంలో, ఇప్పుడు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను కూడా ప్రదర్శించారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామనప్పుడు ఎందుకు రాజీనామ చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం రాజీనామాల పేరుతో డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తనను రాజీనామా చేయమనే అధికారం ఎవరికీ లేదన్నారు. మూడేళ్లలో విశాఖపట్నంకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని విమర్శించారు. మూడున్నరేళ్లలో విజయనగరం జిల్లాకు బొత్స సత్యనారాయణ ఏం చేశారని ప్రశ్నించారు. 

ఉత్తరాంధ్రను కబళించేందుకు రాబంధులు వస్తున్నాయని అన్నారు. ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలు కొట్టేశారని.. విశాఖలో భూ దోపిడీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులపై నమ్మకం ఉంటే.. సీఎం జగన్ అసెంబ్లీని డిజాల్వ్ చేయాలని సవాలు విసిరారు. మూడు రాజధానుల అజెండా వైసీపీ.. అమరావతే రాజధాని అజెండాతో తాము ఎన్నికలకు వెళ్దామని అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ల వాదనకు ఆమోదం లభించినట్టేనని అన్నారు. నాన్ పొలిటికల్ జేఏసీలో ఉన్నవాళ్లంతా వైసీపీ పేటీఎం బ్యాచ్‌ అని ఆరోపించారు. 

click me!