
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. వికేంద్రీకరణకు మద్దతు పేరుతో ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఈ నెల 15న విశాఖ గర్జన పేరిట తలపెట్టిన భారీ ర్యాలీని ఉద్దేశించి పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరుస ట్వీట్స్‌లో వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ చేస్తున్న ట్వీట్స్‌కు ఏపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. పవన్‌కు త్రీ క్యాపిటల్స్ ఉన్నాయంటూ విమర్శించారు.
‘‘దత్త తండ్రి చంద్రబాబు తరఫున.. దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ మియావ్ మియావ్...!. మియావ్.. మియావ్ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ త్రీ క్యాపిటల్స్- 1-అంతర్జాతీయ రాజధాని మాస్కో.. 2-జాతీయ రాజధాని ముంబై.. 3-పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్’’ అని గుడివాడ అమర్‌నాథ్ ట్వీట్స్ చేశారు.
మరోవైపు మంత్రి అంబటి రాంబాబు కూడా పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ కోసం మొరిగే వాళ్ళకి గర్జన అర్ధమవుతుందా? అని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. రాజధాని వికేంద్రీకరణ ఆలోచనలపై వైసీపీ సర్కార్‌కు పవన్ పలు ప్రశ్నలు సంధించారు. హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల సమూహం మూడు నగరాల్లో ఉండటం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధికి హామీ ఇస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని వైసీపీ ప్రభుత్వం హృదయపూర్వకంగా కోరుకుంటే.. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆర్థిక అధికారాలు, నిర్ణయాధికారాలను ఎందుకు ఇవ్వకూడదని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు స్థానిక సంస్థల నిధులను (14వ, 15వ ఆర్థిక సంఘం) ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయిందో సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వ పెద్దలు నిజంగా 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. అన్ని అధికారాలను స్థానిక సంస్థలకు ఎందుకు బదిలీ చేయరని అడిగారు. ఇది నిజమైన వికేంద్రీకరణ కాదా అని ప్రశ్నించారు.
దేనికి గర్జనలు? అని వరుస ట్వీట్స్‌తో వైసీపీ సర్కార్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా అని ప్రశ్నించారు. వరుసగా ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.