అతి కిరాతకంగా అంకుల్ ను హతమార్చిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు.
గుంటూరు: దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకుల్ హత్యలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని ఎస్పీ విశాల్ గున్నితెలిపారు. అతి కిరాతకంగా అంకుల్ ను హతమార్చిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల్లో ముగ్గురితో ఉన్న విభేదాలే అంకుల్ హత్యకు కారణమని పేర్కొన్నారు.
హత్యకు పాల్పడిన నిందితులంతా మృతుడికి తెలిసిన వారేనని... గతంలో వీరంతా కలిసి పని చేసినట్లుగా తన విచారణలో తేలిందన్నారు. కోటేశ్వరరావు అనే నిందితుడికి మృతుడు అంకుల్ కు మధ్య వివిధ కారణాలతో విభేదాలున్నాయన్నారు. అలాగే మరో నిందితుడు వెంకటకోటయ్యకు అంకుల్ కి మధ్య కొంత కాలంగా గొడవలు ఉన్నాయని తెలిపారు. వెంకటకోటయ్య గతంలో జనశక్తి అనే గ్రూప్ లో పని చేసినట్లుగా తేలిందన్నారు.
ఆహారంలో మత్తు మందు కలిపి దాన్ని అంకుల్ చేత తినిపించి స్పృహ కోల్పోయిన అనంతరం హత్య చేశారని ఎస్పీ తెలిపారు. ఈ హత్యలో పాల్గొన్న మిగతా నిందితులకు 8 ఎకరాలు, రూ.15 లక్షల ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుని హత్య చేయించారని వెల్లడించారు. భూములు తగాదాలు, ఇతర వ్యక్తిగత కారణాలే ఈ హత్యకు కారణమని ఎస్పీ స్పష్టం చేశారు.
అంకుల్ హత్య కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులు వీరే:
1. కర్పూరపు వెంకటకోటయ్య
2. గుర్రం వెంకటేశ్వర రెడ్డి
3. చిన్న శంకర్ రావు
4. మేకల చినకోటేశ్వరరావు
5. పొట్టిసిరి అంకారావు
6. అద్దంకి రమేష్