టీడీపీ-జనసేన కలయిక పదవుల కోసం కాదు, వాటి అంతిమలక్ష్యం అదే.. నాదెండ్ల మనోహర్

By SumaBala Bukka  |  First Published Feb 24, 2024, 9:06 AM IST

నేడు జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఈ సమయంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 


పశ్చిమగోదావరి : భావితరాల అభివృద్ధి కోసమే జనసేన-టిడిపి కలయిక అని జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. పొత్తులు పెట్టుకోవడం వల్ల రాజకీయ లబ్ది పొందాలని జనసేన అనుకోవడంలేదని చెప్పుకొచ్చారు. ప్రజలు జగన్ పాలన మీద విసిగిపోయారని.. వారి తరఫున పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వారి గళాన్నే వినిపిస్తారని చెప్పుకొచ్చారు.

జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మాట్లాడితే పేదలకు పెత్తందారులకు యుద్ధమని సీఎం పదేపదే చెబుతున్నారని…మరి ప్రజల సొమ్ముతో రెండు హెలికాప్టర్లు ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ప్రతిపక్షాలను విమర్శించడానికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపణలు గుర్తించారు.

Latest Videos

First List: హైదరాబాద్‌ నుంచి ఏపీకి చంద్రబాబు, పవన్.. రేపు మధ్యాహ్నం టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా?

వైయస్ జగన్మోహన్ రెడ్డి 45 రోజుల్లో దిగిపోయే ముఖ్యమంత్రి అని, ప్రజాధనాన్ని తీవ్రంగా వృధా చేస్తున్నారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన టిడిపి ప్రచార సభకు సంబంధించిన వివరాలను చెబుతూ.. ఇది రెండు పార్టీలు నిర్వహించుకుంటున్న సభా వేదిక అని తెలిపారు. జనసేన బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు. ఈ వేదికపై అన్ని నియోజకవర్గాలకు చెందిన  దాదాపు 500 మంది అతిథులు పాల్గొంటారని తెలిపారు. టిడిపితో జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు లక్షల సంఖ్యలో ఈ సభకు హాజరవుతారని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు హెలికాప్టర్లు వాడడం మీద చట్టపరంగా పోరాడుతామని నాదెండ్ల మనోహర్ అన్నారు. దేశ ప్రధాని రక్షణ కోసం మాత్రమే రెండు హెలికాప్టర్లను వాడాలని చట్టం ఉందని తెలిపారు. ఎన్డీఏలో జనసేన భాగం… రాష్ట్ర అభివృద్ధి కావాలంటే కేంద్రం సహకారం అవసరం ఉంటుంది.. బిజెపి జనసేన టిడిపి మూడు కలిసి వెళ్లేలా ఇంకా బీజేపీతో చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే రెండు పార్టీల అధ్యక్షుల మధ్య అనేకసార్లు చర్చలు జరిగాయని, ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. 

click me!