
నంద్యాల మున్సిపాలిటీని కాపాడుకునేందుకు టిడిపి నానా అవస్తలు పడుతోంది. 2013లో జరిగిన ఎన్నికల్లో టిడిపికి 29 మంది కౌన్సిలర్లు, వైసీపీ తరపున 13 మంది కౌన్సిలర్లు గెలిచారు. అయితే, శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరిపోవటంతో ఆయనతో పాటు 25 మంది కౌన్సిలర్లు వైసీపీలోకి వెళ్ళిపోయారు. అంటే నంద్యాల మున్సిపాలిటీలో టిడిపి దాదాపు ఖాళీ అయిపోయినట్లే.
త్వరలో జరుగనున్న ఉపఎన్నికల సమయానికి మున్సిపాలిటీలో వైసీపీ ఉంటే టిడిపికి ఇబ్బందే. దాంతో బెదిరింపులకు దిగింది. టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వైసీపీలో చేరిన కౌన్సిలర్లకు బహిరంగంగా అల్టిమేటమ్ జారీ చేయటం కలకలం రేపుతోంది. శనివారం మధ్యాహ్నానికి టిడిపి కౌన్సిలర్లందరూ తిరిగి పార్టీలోకి రాకపోతే అందరి పదవులనూ ఊడబీకిస్తానంటూ చెప్పటం గమనార్హం.
నంద్యాల నియోజకవర్గ కేంద్రమైన నంద్యాల మున్సిపాలిటీలో టిడిపి ఖాళీ అయిపోవటం నిజంగా పార్టీకి పెద్ద దెబ్బే. దానికితోడు సోమిశెట్టి చాలా క్లిష్టమైన స్ధితిలో జిల్లా అధ్యక్ష్య బాధ్యతలు తీసుకున్నారు. దాంతో కౌన్సిలర్లను వెనక్కు రప్పించే బాధ్యతను చంద్రబాబునాయుడు సోమిశెట్టిపై మోపారు. దాంతో సోమిశెట్టి నేరుగా రంగంలోకి దిగారు.
ఇదే విషయమై సోమిశెట్టి ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ, తమ కౌన్సిలర్లు గనుక వెనక్కు రాకపోతే వాళ్ళ పదవులను ఊడబీకటం ఖాయమన్నారు. న్యాయపరమైన చర్యలను పరిశీలిస్తున్నట్లు కూడా చెప్పారు. అదేవిధంగా ఛైర్ పర్సన్ సులోచన పైన ఉన్న అవినీతి ఆరోపణలపై కూడా విచారణ చేయిస్తామన్నారు. టిడిపి నుండి వైసీపీలోకి వెళ్ళింది 15 మంది కౌన్సిలర్లు మాత్రమేనని కూడా సోమిశెట్టి చెప్పారు.