
అమరావతి: తమను ఎమ్మెల్సీలుగా కొనసాగించాలని ఇటీవలే రిటైరయిన మాజీ టిడిపి ఎమ్మెల్సీలు ఏపీ అసెంబ్లీ సెక్రటరీని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తమను ఎమ్మెల్సీగా కొనసాగించాల్సి వుంటుందున్నారు. ఆగష్టు 11వ తేదీ వరకు తమను పదవిలో కొనసాగించాలని... ముందుగానే రిటైర్మెంట్ ప్రకటన చేయడం అన్యాయమన్నారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి మాజీ ఎమ్మెల్సీలు ద్వారంపూడి జగదీష్, రెడ్డి సుబ్రమణ్యం, రాజేంద్రప్రసాద్ లేఖ రాశారు.
సీఈసీ ఆదేశాలకు విరుద్ధంగా తమను ముందుగానే పదవీ విరమణ చేయించారని వీరు ఆరోపించారు. అసెంబ్లీ సెక్రటరీ స్పందించకపోతే తాము కోర్టుకు వెళతామని టిడిపి తాజా మాజీ ఎమ్మెల్సీలు వెల్లడించారు.
గత నెల 18న ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీలు, ఒక వైసీపీ ఎమ్మెల్సీ రిటైరయ్యారు. దీంతో రాష్ట్ర శాసనమండలిలో టీడీపీ సంఖ్య బలం తగ్గిపోయింది. ఏపీ శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులుంటారు. వీరిలో టీడీపీకి చెందిన రెడ్డి సుబ్రమణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు, బుద్దా నాగ జగదీశ్వరరావులు ఇటీవలే రిటైరయ్యారు. వైసీపీ నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు రిటైరయ్యారు.
read more మండలి రద్దుపై రఘురామ పావులు.. కేంద్రానికి లేఖ, జగన్ కోరికను నెరవేర్చాలంటూ వినతి
ఈ రిటైర్మెంట్ ప్రకటనతో మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 15కి తగ్గిపోనుంది. వైసీపీ బలం 21కి పెరిగింది. ఏపీ శాసనమండలిలో టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో సాంకేతికంగా ఆయన టీడీపీ సభ్యుడుగా లెక్కించలేం.
ఇదిలావుంటే ఇటీవలే గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలుగా నామినేటయ్యారు. ఈ నలుగురి బలంతో వైసీపీ బలం 21కి చేరుకొంది. స్థానిక సంస్థల ద్వారా శాసనమండలిలో 11 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ స్థానాలను భర్తీ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. శాసనమండిలో పీడీఎఫ్ సభ్యులు నలుగురున్నారు. యూటీఎఫ్ సభ్యుడు ఒకరున్నారు. ఇండిపెండెంట్లు ముగ్గురున్నారు.
శాసనమండలిలో టీడీపీకి ఇప్పటివరకు బలం ఉండడంతో శాసనభలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన బిల్లులను మండలిలో అడ్డుకొంది టీడీపీ. అయితే ఎగువ సభలో టీడీపీ బలం తగ్గి వైసీపీ బలం పెరగడంతో ఇక వైసీపీ సర్కార్ కు ఇబ్బందులు లేకుండాపోయింది. గతంలో మూడు రాజధానుల బిల్లులతో పాటు ఇతర బిల్లులను శాసనమండలిలో టీడీపీ అడ్డుకొన్న విషయం తెలిసిందే.