కడప సెంట్రల్ జైలు క్వారంటైన్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి

By telugu teamFirst Published Jun 15, 2020, 6:51 AM IST
Highlights

వాహనాల కొనుగోలు ఆరోపణల్లో అరెస్టయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు కడప సెంట్రల్ జైలులోని క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

కడప: బిఎస్ -3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణపై అరెస్టయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని కడప సెంట్రల్ జైలు క్వారంటైన్ లో ఉంచారు. వారిద్దరిని కడప సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. 

జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలకు అనంతపురంలోనే కరోననా నిర్దారణకు వైద్య సిబ్బంది స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది. దాంతో వారిద్దరినీ కడప జైలులో ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉంచారు. జేసి ప్రభాకర్ రెడ్డి నేల మీద కూర్చోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కడప సెంట్రల్ జైలులో ఖైదీలకు ములాఖత్ నిలిపేశారు. ఖైదీలను చూడడానికి ఎవరినీ అనుమతించడం లేదు. ఒకవేళ తప్పనిసరి అయితే డీజీపీ అనుమతితో ములాఖత్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను జైలులో ఎవరూ కలవడానికి వీలు లేకుండా పోయింది. 

జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతపురం కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. రోడ్డు మార్గాన వారిద్దరినీ ఆదివారం తెల్లవారు జామున కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఒక గదిలో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని క్వారంటైన్ కు పంపించారు. 14 రోజుల రిమాండ్ కూడా వారిద్దరు కడప సెంట్రల్ జైలులోనే పూర్తి చేస్తారు. ఒక వేళ ఈలోగా బెయిల్ మంజూరైతే విడుదలవుతారు. 

click me!