ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.
అమరావతి:ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రెండు రోజులుగా ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21న ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు.ఇప్పటికే ఏపీ అసెంబ్లీ నుండి ఐదుగురు ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. నిన్న 14 మంది ఎమ్మెల్యేలను ఒక్క రోజుకు సస్పెండ్ చేశారు. ఇవాళ మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఒక్క రోజుకు సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో అధికార పక్షం తీరుపై టీడీపీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిన్న ఏపీ అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు తమ ఎమ్మెల్యే బాలకృష్ణను రెచ్చగొట్టారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో ఆరోపించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందుగా ఈ సమావేశాలకు వెళ్లాలా.. వద్దా అనే విషయమై టీడీఎల్పీ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు. గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీని బహిష్కరించారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీ బహిష్కరణతో విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ పరిణామాలపై లోతుగా టీడీఎల్పీ చర్చించింది. శాసనసభ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే నిన్నటి నుండి ప్రారంభమైన సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరౌతున్నారు. ఏపీ అసెంబ్లీలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.