ఏపీలో కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ రెడీ, హైకమాండ్ దే నిర్ణయమంటున్న రఘువీరా

By Nagaraju TFirst Published Oct 31, 2018, 3:32 PM IST
Highlights

రాబోయే ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ విప్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో పొత్తులకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. బీజేపీని ఓడించేందుకు ఏపార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటామని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 

అమరావతి: రాబోయే ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ విప్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో పొత్తులకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. బీజేపీని ఓడించేందుకు ఏపార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటామని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీతోనైనా పొత్తుకు రెడీ అన్నారు. తమకు కావాల్సింది కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటేనని స్పష్టం చేశారు. 

మరోవైపు పొత్తులపై అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని హైకమాండ్ ఆదేశించిందని తెలిపారు. ఏపీలో 72 శాతం మంది ప్రజలు రాహుల్‌ని ప్రధానిగా కోరుకుంటున్నారన్నారని రఘువీరా తెలిపారు. ఒకప్పుడు పప్పు అన్న రాహుల్‌ ఇప్పుడు కేంద్రానికి నిప్పు అయ్యారని ఆయన పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 20 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటిస్తారని తెలిపారు. చిరంజీవి కాంగ్రెస్‌తోనే ఉంటారని, ఎన్నికలకు 2 నెలల ముందు ప్రచారానికి వస్తానని రాహుల్‌కి చిరంజీవి చెప్పారని తెలిపారు. జగన్‌పై దాడి కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఉందని విమర్శించారు. దాడి ఘటనను టీడీపీ, వైసీపీ, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని రఘువీరా మండిపడ్డారు.

click me!