అసెంబ్లీలోకి వారిని అనుమతించకపోవడం దారుణం: స్పీకర్ కు చంద్రబాబు లేఖ

Arun Kumar P   | Asianet News
Published : Nov 29, 2020, 02:49 PM IST
అసెంబ్లీలోకి వారిని అనుమతించకపోవడం దారుణం: స్పీకర్ కు చంద్రబాబు లేఖ

సారాంశం

రేపటి నుండి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు మీడియాను అనుమతించడంతో పాటు మీడియా పాయింట్  పునరుద్దరించాలని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు స్పీకర్ ను కోరారు. 

అమరావతి: సోమవారం నుండి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోకి మీడియాను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఖండించిన టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మీడియా పాయింట్  పునరుద్దరించాలని కోరుతూ స్పీకర్ కు లేఖ రాశారు. 

స్పీకర్ కు చంద్రబాబు రాసిన లేఖ యధావిధిగా:    

తేది: 29.11.2020

గౌరవ శాసనసభ స్పీకర్ గారికి,

ఆంధ్రప్రదేశ్ శాసన సభ, అమరావతి

నమస్కారం,

విషయం:  నవంబర్ 30వ తేది నుండి జరగనున్న 15వ అసెంబ్లీ సమావేశాలకు మీడియాను అనుమతించడంతో పాటు మీడియా పాయింట్  పునరుద్దరించడం కొరకు

శాసనసభ శీతాకాల సమావేశాలకు మీడియాను అనుమతించకుండా, మీడియా పాయింట్ ను తీసివేస్తూ ఆదేశాలు ఇవ్వటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రధాన భాగస్వామి అయిన మీడియాను నిషేధించడం అప్రజాస్వామ్యం. ప్రజా సమస్యలపై ప్రజావాణి వినిపించి, చట్టసభల నిర్వహణను, జరిగే తీరును, చర్చలను ప్రజలకు యథాతథంగా చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైంది. ఈ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2430 ద్వారా మీడియా హక్కులను హరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే శిక్షించాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ జీవోను ఈ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ మీడియా కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ జీవోను తప్పుబట్టింది. 

ఇప్పుడు చట్టసభల్లోకి మీడియాను నిషేధించడం అంతకంటే దారుణమైన చర్యగా భావిస్తున్నాము. ప్రజా సమస్యలపై ప్రభుత్వ స్పందనను, ప్రభుత్వ పాలనా శైలిని చర్చించి అవసరమైతే వాటిపై సలహాలు, నిరసనలు తెలిపే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. అందులో భాగంగా అధికారపక్షం, ప్రతిపక్షం వ్యవహారశైలిని నిస్పక్షపాతంగా ప్రజలకు చేరవేసే అవకాశం ఒక్క మీడియాకు మాత్రమే ఉంది. అటువంటి మీడియాను నిషేధించడం, పత్రికా హక్కులను కాల రాయటం,  ప్రజాస్వామిక విలువలను అణగదొక్కటంగా మేము భావిస్తున్నాము. పార్లమెంటు సమావేశాలకు మీడియాను అనుమతించారు. అక్కడ లేని నిషేధం ఇక్కడ ఎందుకు విధిస్తున్నారు? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. 

1998లో తెలుగుదేశం పార్టీ దేశంలో ప్రథమంగా చట్ట సభల్లోని కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయినప్పటికీ చట్టసభల్లో జరిగిన చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేసి చట్టసభల్లో ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ప్రజలకు చెప్పిన ఘనత టీడీపీదే. కాలక్రమేణా చట్టసభల్లోని కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం పార్లమెంటు కూడా ప్రారంభించింది. చాలా రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించి అమలు చేస్తున్నాయి. కాబట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో టీడీపీ అవలంభించిన చర్యలు, అనుసరించిన విధానాలు అందరికీ తలమానికంగా నిలిచాయి. 

చట్ట సభల్లోని అంశాలను ప్రజలకు తెలియకుండా ఉండటానికి మీడియాను నిషేదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చట్టసభల్లోని కార్యక్రమాలను ప్రజలకు యథాతథంగా తెలియజేసే అవకాశం ఉన్న మీడియాను నిషేధించడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నిరసిస్తూ వెంటనే చట్టసభల్లో ప్రత్యక్ష ప్రసారాలను తరతమ భేదాలు లేకుండా అన్ని మీడియా సంస్థలకు అవకాశం ఇవ్వాలని, చట్టసభల సమావేశాలు జరుగుతున్నన్ని రోజులూ మీడియా పాయింట్ ను అనుమతించాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంకి అర్థం సభలో మెజారిటీ అయినప్పటికి, సభా కార్యక్రమాలను యథాతథంగా ప్రజలకు తెలియజేసే అవకాశం ఇవ్వడమే నిజమైన పరమార్థం. 


ధన్యవాదములతో,

(నారా చంద్రబాబునాయుడు)
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?