ఆంబోతుల మాదిరిగా పడ్డారు.. నేనూ, పవన్ కళ్యాణ్‌ వైసీపీ బాధితులమే : చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Feb 17, 2024, 9:48 PM IST

నేను, పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ బాధితులమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు అభ్యర్ధులు దొరకడం లేదని.. వై నాట్ పులివెందుల అనేది తమ నినాదమని ఆయన తెలిపారు. 


హైదరాబాద్‌ను కొద్దికాలం పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. శనివారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘‘ రా .. కదలిరా ’’ బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు. అసెంబ్లీలో అమరావతి రాజధాని అని చెపారు.. తర్వాత మాట మార్చి 3 రాజధానులు అన్నారని, ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నారని ఆయన మండిపడ్డారు. 

అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుని రాష్ట్రంలో ఉపాధి లేకుండా చేశారని, రాజధాని పూర్తయి వుంటే రాష్ట్రం పరిస్థితి మరోలా వుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ ఎందుకు మౌనంగా వున్నారని టీడీపీ అధినేత ప్రశ్నించారు. కేంద్రం సాయం చేస్తామన్నా.. తెచ్చుకోలేని పరిస్ధితిలో వున్నారని దుయ్యబట్టారు. 

Latest Videos

జగన్ పెట్టే ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ వుంటుందని.. ఇలాంటి దోపిడీని ఎప్పుడూ చూడలేని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోయే ప్రభుత్వాన్ని మోస్తే పోలీసులే మునిగిపోతారని.. మనం చట్టం ప్రకారం వెళ్తున్నామని, అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. నేను, పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ బాధితులమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మాట్లాడితే బటన్ నొక్కానని జగన్ చెబుతున్నారని.. అందుకే ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు, చెత్త, నీరు, ఆస్తిపై పెంచారని ఆయన దుయ్యబట్టారు. అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని.. మరో 52 రోజుల తర్వాత జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. 

జగన్‌కు అభ్యర్ధులు దొరకడం లేదని.. వై నాట్ పులివెందుల అనేది తమ నినాదమని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు మన గెలుపు ఖాయమైందని.. పర్చూరులో గ్రానైట్ వ్యాపారులపై వైసీపీ నేతలు కేసులు పెట్టించి వేధించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంబోతుల మాదిరిగా వూరు మీద పడ్డారని.. గొట్టిపాటి రవికుమార్‌కు రూ.3 వేల కోట్ల జరిమానా విధించారని ఆయన ధ్వజమెత్తారు. 

click me!