రౌడీ ఎమ్మెల్యేలను పరిగెత్తిస్తా.. నా రికార్డు ఎవరూ కొట్టలేరు: చంద్రబాబు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Apr 8, 2021, 10:07 PM IST
Highlights

వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం శ్రీకాళహస్తిలో జరిగిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు

వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం శ్రీకాళహస్తిలో జరిగిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎమ్మెల్యేలు పెద్ద రౌడీలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీలను కూడా పరిగెత్తిస్తాం తప్ప రౌడీలకు భయపడే సమస్యేలేదని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ తాను ఎలాంటి సమస్య లేకుండా నడచి వచ్చానని, అందుకు కారణం తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుండడమేనని అన్నారు. "అదే అధికారి, ఇదే పోలీసులు, ఇదే తహసీల్దారు, అదే కలెక్టరు... పంచాయతీ ఎన్నికల సమయంలో మీరు ఏవిధంగా ప్రవర్తించారు? ఇప్పుడు ఏవిధంగా ఉన్నారు? ప్రజలే గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇప్పుడందరూ మళ్లీ నేనే ముఖ్యమంత్రిగా రావాలంటున్నారని... తనకేమైనా సీఎం పదవి కొత్తా! 14 ఏళ్లు చేశానని  నా రికార్డు ఎవరూ బద్దలు కొట్టే పరిస్థితి లేదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

9 ఏళ్లు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నానని.. పదేళ్లు విపక్షనేతగా ఉన్నానని మళ్లీ రెండు రాష్ట్రాలు కలవవు కాబట్టి తన రికార్డు పదిలంగా ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజలు కూడా టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు తేడా గమనించాలని.. తిరుపతి ఉప ఎన్నికతోనే మార్పుకు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు.

కొంప కాలిపోయిన తర్వాత తీరిగ్గా బయటికొచ్చి బావి తవ్వితే ఏం ఉపయోగం ఉండదన్నారు. నేను తిరుపతి వచ్చింది పదవి కోసం కాదని.. టీడీపీ తరఫున ఓ ఎంపీ గెలిస్తే మరింత బలం పెరుగుతుందని రాలేదని చంద్రబాబు వెల్లడించారు.

ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టుకుంటూ పోయాడని.. ఇప్పుడా ముద్దులన్నీ పోయి ప్రజలకు గుద్దులే మిగిలాయని టీడీపీ చీఫ్ సెటైర్లు వేశారు. జగన్ వైఖరితో ప్రత్యేక హోదా పోయిందని.. పెట్టుబడులు పోయాయని చంద్రబాబు ఆరోపించారు.

కేసులకు భయపడి ఇంట్లో ఉంటే సమాజం ఎలా బాగుపడుతుందన్న ఆయన..  రాష్ట్రం దివాళా తీసిన తర్వాత చేయడానికి ఏం ఉండదని ... ప్రజలు ముందుకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. 

click me!