
పొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే, కడప పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పొద్దుటూరు మార్కెట్ కూల్చివేత ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని... అలాగే అరెస్ట్ చేసిన లింగారెడ్డి సహా టిడిపి మరియు ఇతర ప్రతిపక్షాల నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేసి విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
వ్యాపారులు వద్దని బతిమాలినా వినకుండా కూరగాయల మార్కెట్ కూల్చివేత వైసిపి మరో తుగ్లక్ చర్యగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ముస్లిం, బిసి, ఎస్సీ, ఎస్టీలు నడుపుకునే షాపులను కూల్చడాన్ని ఖండిస్తున్నానన్నారు. నిర్మించడం చేతగాని వైసిపికి కూల్చేసే హక్కు ఎక్కడిది..? అని చంద్రబాబు ప్రశ్నించారు.
''ప్రజావేదికతో ప్రారంభమైన వైసిపి విధ్వంసకాండ ప్రతి నియోజకవర్గంలోనూ చేస్తున్నారు. చిరువ్యాపారుల పొట్టకొట్టే చర్యలకు వైసిపి స్వస్తి చెప్పాలి. కమిషన్ల కక్కుర్తితో వ్యాపారులను వేధించడం దారుణం. ఇలాంటి చర్యలను వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మానుకోవాలి'' అని చంద్రబాబు సూచించారు.