టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆయన రిమాండ్‌ను అక్టోబర్ 19 వరకు పొడిగించింది ఏసీబీ కోర్ట్.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆయన రిమాండ్‌ను అక్టోబర్ 19 వరకు పొడిగించింది ఏసీబీ కోర్ట్. ఈ కేసులో చంద్రబాబు రిమాండ్ గడువు గురువారంతో ముగిసింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
ఇకపోతే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్‌లపై విచారణ మరోసారి వాయిదా పడింది. విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్‌లపై విచారణ సందర్భంగా.. ఇరుపక్షాల న్యాయవాదుల హోరాహోరీగా వాదనలు వినిపించారు. అయితే విచారణను రేపటికి వాయిదావేస్తున్నట్టుగా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు విననున్నట్టుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఇక, చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్‌లపై గత రెండు రోజుల నుంచి వరుసగా ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తరఫున ప్రమోద్ దూబే వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
నేడు హోరా హోరీగా వాదనలు..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబుకు సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది ప్రమోద్ దూబే వాదనలు వినిపించారు. ‘‘రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారు. డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సీఎం హోదాలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌కు నిధులు మాత్రమే మంజూరు చేశారు. ఆ తరువాత ఒప్పందం ప్రకారం నలభై సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు.
అంతా ఓపెన్ గా జరిగితే ఇందులో స్కాం ఎక్కడుంది, చంద్రబాబు పాత్ర ఏముంది?. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. ఇప్పటికే కస్టడీలో చంద్రబాబు విచారణ అధికారులకు సహకరించారు. ఇక కస్టడీ కూడా అవసరం లేదు.. అయినా విచారణ సాగదీయడానికే ఈ పిటిషన్ వేశారు. ఈ అంశాలను పరిశీలన చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నాం’’ అని ఆయన వాదించారు.
మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘చంద్రబాబు స్వయంగా 13 చోట్ల సంతకాలు పెట్టారు. రూ.27 కోట్లు నేరుగా ఖాతాలో జమ అయ్యాయి. న్యాయం ముందు అందరూ సమానమే. ముఖ్యమంత్రైనా...సామాన్యుడికైనా న్యాయమొక్కటే. ముఖ్యమంత్రి హోదాను అడ్డుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా?. ఇది ఆర్డినరీ కేసు కాదు.. తీవ్ర ఆర్ధిక నేరం కలిగిన కేసు. చంద్రబాబు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారు’’ అని పొన్నవోలు వాదించారు.