వైసీపీలో అంతర్యుద్దం.. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు ఇంకా పెరుగుతుంది: చంద్రబాబు

By Sumanth KanukulaFirst Published Dec 31, 2022, 2:34 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతుందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతుందని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయిందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి ఆర్థికంగా మానసిక క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. శారీరక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులతో కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. 

రాష్ట్రం గంజాయి హబ్‌గా మారిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు ఘటనలో తనపై కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందర్ రెడ్డిని చంపిన  వ్యక్తిపై ఎటువంటి  చర్యలు లేవని విమర్శించారు. 

వైసీపీ ప్రభుత్వం రానురాను తిరుగుబాటు ఇంకా ఇంకా పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. మనకెందుకని పోరాటం చేయకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని కామెంట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలూ ముందుకు రావాలని పిలుపిచ్చారు. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఒకవైపు ఉంటే.. జగన్ ఒక్కడే ఒక వైపు ఉన్నారని..  ఇప్పటికే యుద్ధం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు.

సీఎం జగన్ సైకో పాలనతో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసేశారని చంద్రబాబు మండిపడ్డారు. 2023 పెనుమార్పులకు వేదిక కానుందని అన్నారు. వైసీపీలో కూడా అంతర్యుద్దం మొదలైందని అన్నారు.  రాష్ట్రంపై గౌరవం ఉండేవారు ఆ పార్టీలో ఉండరని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో స్థానిక సంస్థలను నిర్విర్యం చేశారని.. జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. 
 

click me!