
తెలుగుదేశం పార్టీ టీడీపీ (tdp) 40 ఏళ్ల ప్రస్ధానం లోగో ఆవిష్కరించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu). ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంత బాధ్యతలేని ప్రభుత్వాన్ని తాను చూడలేదన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటుసారా మరణాలపై అసెంబ్లీ సమావేశాల్లో (ap assembly) చర్చ ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. సారా మరణాలను సహజ మరణాలుగా (adulterated liquor) చిత్రీకరిస్తారా? కనీసం దానిపై చర్చ కూడా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మద్యం వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళతామని టీడీపీ అధినేత స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదని మండిపడ్డారు. డయా ఫ్రం వాల్ ఎప్పటిలోగా పూర్తి చేసి నీళ్లు ఇస్తారో జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు (polavaram) పట్ల వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఎద్దేవా చేశారు. నీతి మాలిన చీకటి వ్యాపారం కోసం ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. టీడీపీ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ నలభై ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
ఇకపోతే.. గురువారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో 3 రాజధానులపై (ap three capitals) సీఎం మాట్లాడి, మరోసారి మూడు ముక్కలాటకు తెరదీశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్‌పైన విషం చిమ్ముతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భావితరాల భవిష్యత్‌పై ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. ప్రజల్ని చంపేస్తామని మీరు చట్టం చేయలేరంటూ ఎద్దేవా చేశారు. ఏకపక్షంగా అగ్రిమెంట్ చేసుకోవడానికి వీల్లేదన్నారు. అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు వుందా అని చంద్రబాబు ప్రశ్నించారు.
అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించినప్పుడు మీరు అక్కడే వున్నారు కదా అని ప్రతిపక్ష నేత దుయ్యబట్టారు. ఎందుకు ఆ రోజు వ్యతిరేకించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా, మనసు బాగుండాలంటూ దుయ్యబట్టారు. ప్రజలకు అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని చంద్రబాబు అన్నారు. రాజధానిని ఎంపికే చేసుకునే రాష్ట్ర అధికారాన్ని ఒకసారి ఉపయోగించుకున్నామని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చట్టం చేయలేరని చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్ కోకాపేటలో లక్ష రూపాయలు వున్న ఎకరం.. ఇప్పుడు కోట్లు పలుకుతుందని ఆయన గుర్తుచేశారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం రద్దు చేసి మళ్లీ ప్రజల తీర్పు కోరాలని ఆయన సవాల్ విసిరారు. అగ్రిమెంట్ కుదిరిన తర్వాత తప్పుకోవడం హక్కుల ఉల్లంఘనేనని చంద్రబాబు చురకలు వేశారు. లేని సమస్యలు సృష్టించి అంతా కాళ్ల బేరానికి రావాలన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.