ఓ పక్క కరోనా అలజడి... ఎన్నికల కోసం రమాకాంత్‌తో భేటీ: జగన్‌పై బాబు ఫైర్

By Siva KodatiFirst Published Mar 16, 2020, 6:20 PM IST
Highlights

కరోనాకు అడ్డుకట్ట వేసే అంశంలో ప్రధాని నరేంద్రమోడీ చివరికి పాకిస్తాన్ సహకారం కూడా తీసుకున్నారని, సార్క్ దేశాల సరిహద్దులు మూసివేయించారని ఆయన గుర్తుచేశారు. జగన్ మాత్రం రమాకాంత్ రెడ్డిని పిలిపించుకుని ఎన్నికలు ఎలా నిర్వహించాలో సలహాలు తీసుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు

కరోనాకు అడ్డుకట్ట వేసే అంశంలో ప్రధాని నరేంద్రమోడీ చివరికి పాకిస్తాన్ సహకారం కూడా తీసుకున్నారని, సార్క్ దేశాల సరిహద్దులు మూసివేయించారని ఆయన గుర్తుచేశారు. జగన్ మాత్రం రమాకాంత్ రెడ్డిని పిలిపించుకుని ఎన్నికలు ఎలా నిర్వహించాలో సలహాలు తీసుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం కన్నా కూడా జగన్ ఇతర వైసీపీ నేతలు తెలివైనవారా అని బాబు ప్రశ్నించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, గడచిన 24 గంటల్లో తొమ్మిది దేశాలకు ఇది పాకిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Also Read:జగమొండి భరించలేడు: వైఎస్ జగన్ పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్ ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదని, ఎలా ఎదుర్కోవాలో తెలియదని చంద్రబాబు మండిపడ్డారు.

కరోనాను ప్రపంచ దేశాలన్నీ సీరియస్‌గా తీసుకుంటే.. జగన్ మాత్రం వైరస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షనేత విమర్శించారు. ఏపీకి కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రజలు వస్తున్నారని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

6,770 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారని, వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారా అని ఆయన నిలదీశారు. పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గుతుందనే పరిస్ధితికి వచ్చారని, బ్లీచింగ్ పౌడర్ వేస్తే సరిపోతుందని అంటారా అంటూ బాబు మండిపడ్డారు.

ఇంత జరుగుతుంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లడం బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలపై ఉన్న ధ్యాసలో కనీసం 10 శాతం కరోనాపై లేకపోవడం, ఇలాంటి క్లిష్టపరిస్ధితుల్లో ఇటువంటి ముఖ్యమంత్రి ఉండటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని టీడీపీ అధినేత ఎద్దేవా చేశారు.

Also Read:ఈసీ రమేష్ కుమార్ చంద్రబాబు స్లీపర్ సెల్: విజయసాయి రెడ్డి

సీఎం పేషీ ఒత్తిడితోనే రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదని చీఫ్ సెక్రటరీ నోట్ విడుదల చేశారంటూ ఆయన ఆరోపించారు. పదవుల కోసం కక్కుర్తిపడి ఇలాంటి చర్యలు చేయొద్దని, బాధ్యతగా వ్యవహరించాలని బాబు హితవు పలికారు.

టీడీపీ హయాంలో డెంగ్యూ ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న దశలో తాను దోమలపై యుద్ధం ప్రకటిస్తే, తనను ఎగతాళి చేశారని ప్రతిపక్షనేత గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమీషన్‌పై అటాక్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 

click me!