
అమరావతి: వైసిపి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలతో పాటు నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రో ధరలు పెంచడమే కాదు చివరకు చెత్తపై పన్ను విధిస్తూ ప్రజలను దోచుకుంటోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష టిడిపి ''బాదుడే బాదుడు'' పేరిట నిరసన చేపట్టింది. ప్రజలను జగన్ సర్కార్ ఎలా దోపిడీ చేస్తోందో వివరించడానికి టిడిపి నాయకులు ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలోనే మునిసిపాలిటీ పన్నుల బాదుడుపై విజయవాడ వాసి ఆవేదన వ్యక్తంచేస్తున వాయిస్ మెసేజ్ ను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ట్వీట్ చేసారు.
''మీకు ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇన్ని పాట్లా! ఇదేం బాదుడు...ఇదేం పాలన? పన్ను పోటుపై ప్రజల ప్రశ్నలకు బదులివ్వండి...లేదా అసత్య హామీలు, నిత్య మోసాలపై క్షమాపణలు చెప్పండి'' అంటూ విజయవాడ వాసి పన్నుల బాదుడు గురించి వివరిస్తున్న వాయిస్ రికార్డింగ్ ను జగచేస్తూ ట్వీట్ చేసారు చంద్రబాబు నాయుడు.
గతంలో మూడువేల రూపాయల ఇంటిపన్ను 5700 రూపాయలకు చేరడంపై ఆడియోలో విజయవాడ వాసి ఆందోళన వ్యక్తం చేసాడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, లైటింగ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, లైబ్రరీ టాక్స్, అనాథరైజ్డ్ పెనాలిటీ, టాక్స్ ఎరియర్స్ ఇంట్రస్ట్ పేరుతో తనకు పన్నులు ఎలా వడ్డించారో విజయవాడ వాసి తెలిపాడు. భారీగా పెరిగిన పన్నులతో పేద, మద్య తరగతిపైమోయలేని భారం పడుతోందని వాయిస్ మేసేజ్ లో విజయవాడ వాసి వివరించారు.
తన విన్నపాన్ని మన్నించి పన్నుల బాదుడు నుంచి రక్షించాలని వైసిపి ప్రభుత్వాన్ని వాయిస్ మెసేజ్ ద్వారా కోరాడు. ఇలా పన్నుల బాదుడుపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్న ఓ సామాన్యు పౌరుడి ఆడియోను ట్విట్టర్లో పెట్టి సమాధానం చెప్పాలని టిడిపి చీఫ్ చంద్రబాబు జగన్ సర్కార్ ను నిలదీసారు.
ఇప్పటికే వైసిపి ప్రభుత్వ అసమర్ధ పాలనలో ప్రజలపై భారం పడుతోందని చంద్రబాబు ఇదే ట్విట్టర్ వేదికన ఆందోళన వ్యక్తం చేసారు. ''గతంలో సంతోషంగా, సంక్షేమంగా సాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయాణం...ఇప్పుడు సంక్షోభం దిశగా పయనిస్తోంది. చెత్త పన్నులు, పెరిగిన కరెంటు చార్జీలు, భగ్గుమంటున్న నిత్యావసరల ధరలతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. ఇసుక, మద్యం వంటి వాటితో జరిగే దోపిడి సరేసరి'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు.
''వైసీపీ సర్కార్ బాదుడే బాదుడు విధానంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఒక్కో కుటుంబంపై ఏడాదికి లక్షకు పైగా భారం పడుతోంది. మీ కష్టార్జితాన్ని పిండుకుని... తాను దర్జాగా దండుకుంటున్న జగన్ పాలనపై ప్రజలు పోరాడాలి. తాను చేసే అప్పుల కోసం మీ జేబులు ఖాళీ చేస్తున్న ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలి'' అని సూచించారు.
''పథకాల పేరుతో ప్రజలు నుంచి పిండిన దాంట్లో 10 శాతం మీకిచ్చి... మిగతా 90 శాతం తమ జేబుల్లో వేసుకుంటున్న దోపిడీని ప్రశ్నించాలి. ప్రభుత్వ పన్నులు, బాదుడుపై ప్రతిపక్ష తెలుగుదేశం చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. ప్రభుత్వ మెడలు వంచేందుకు ప్రజలంతా తెలుగుదేశంతో కలిసిసాగండి'' అని చంద్రబాబు రాష్ట్ర ప్రజానికాన్ని కోరారు.