ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఎంక్వైరీ వేసుకుని.. చర్యలు తీసుకోవచ్చు: జగన్‌కు బాబు సవాల్

By sivanagaprasad Kodati  |  First Published Dec 23, 2019, 3:42 PM IST

అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందనే ఉద్దేశ్యంతోనే రాజధానిగా అమరావతిని ఎంపిన చేశామన్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు


అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న వాళ్లు జ్యూడీషియల్ ఎంక్వైరీ వేసి దానిని నిరూపించి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని సవాల్ విసిరారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.

అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందనే ఉద్దేశ్యంతోనే రాజధానిగా అమరావతిని ఎంపిన చేశామన్నారు బాబు తెలిపారు. సోమవారం తుళ్లూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Latest Videos

undefined

Also Read:చంద్రబాబుది మోసం కాదా, నా జీవితంలో మర్చిపోలేను: జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ల్యాండ్‌పూలింగ్‌లో భూములివ్వమని తాను పిలుపునిస్తే.. స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. ఒక ఎకరా భూమి ఇవ్వాలంటే రైతులు ఎంతో బాధపడతారని.. కానీ వారు రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చారని  చంద్రబాబు తెలిపారు.

అమరావతి ఓ మహానగరం అవుతుందని తాను భావించానని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీని నిలబెట్టాల్సింది పోయి తాము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే కుదరదని బాబు విమర్శించారు. కంప్యూటర్ లాటరీ ద్వారా రైతులకు ఫ్లాట్లు ఇచ్చామని టీడీపీ చీఫ్ గుర్తుచేశారు. 

ఒక రూపాయి ఖర్చు లేకుండా రాజధాని నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశామని బాబు అన్నారు. అసెంబ్లీయో, హైకోర్టో ఉంటే అభివృద్ధి జరగదని బాబు స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే వచ్చే పెట్టుబడులతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఆధునిక నగరం వస్తోందని అమరావతిని ప్రపంచమంతా పొగిడిందని బాబు వెల్లడించారు.

Also Read:AP Capital: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదంటా!

డబ్బులేవంటూ అమరావతి నుంచి రాజధానిని తరలించాలని చూస్తున్నారని టీడీపీ చీఫ్ ఆరోపించారు. రాజధానిపై సీఎం జగన్ ఉన్నట్లుండి ఎందుకు మాట మార్చారని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న వాళ్లు జ్యూడీషియల్ ఎంక్వైరీ వేయాలని ప్రతిపక్షనేత డిమాండ్ చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతిని చంపేయాలని చూడటం దారుణమన్నారు. 

అమరావతి మునిగిపోతుందని గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లారని బాబు గుర్తుచేశారు. రాజధానిని గురించి ఒకరు స్మశానమని, మరొకరు ఎడారి అంటారని ఆయన మండిపడ్డారు. రాజకీయలు ఎన్నికల సమయంలో చేసుకుందామని, ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

గతంలో వచ్చిన వరదల్లోనూ అమరావతి ఎప్పుడూ మునిగిపోలేదన్నారు. భారీ నిర్మాణాలకు ఇది సరైన భూమని నిపుణులు నివేదిక ఇచ్చిన సంగతిని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటున్న ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. రాజధాని భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

కమిటీలతో కాదు.. హైకోర్టు జడ్జితో విచారణ జరపాలని ఆయన కోరారు. జీఎన్ రావు కమిటీ నివేదిక రాకముందే సీఎం జగన్ పేపర్ లీక్ చేశారని.. అది జీఎన్ రావు నివేదిక కాదని, జగన్మోహన్ రెడ్డి నివేదిక అంటూ ఆయన సెటైర్లు వేశారు. ప్రపంచంలో ఎక్కడా కూడా 3 రాజధానులు లేవని ఆయన గుర్తుచేశారు.

ప్రభుత్వ కార్యాలయాలన్ని ఒకే చోట ఉండాలని ఎన్టీఆర్ కృషి చేశారని.. అది సమర్థవంతమైన పరిపాలనకు నిదర్శనమన్నారు. ఐదేళ్ల పాలనా కాలంలో అభివృద్ధిని 13 జిల్లాల్లో వికేంద్రీకరించామని.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూడా అంగీకారం తెలిపినట్లు టీడీపీ అధినేత గుర్తుచేశారు. 

Also Read:వైఎస్ జగన్ కు మద్దతు: చిరంజీవిపై సోమిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

మంత్రులను ఒక చోట, కార్యదర్శులను ఓ చోట ఎలా పెడతారని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో ఒకే సామాజికవర్గం లేదని 35 ఏళ్లుగా ఇది ఎస్సీ నియోజకవర్గమని, పక్కనే ఉన్న మంగళగిరిలో బీసీలు ఎక్కువన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని సంకల్పించింది తెలుగుదేశం పార్టీయేనన్నారు.

రైతులపై పోలీసు కేసులు పెట్టడం దారుణమని బాబు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ మైండ్‌గేమ్ ఆడుతున్నారని.... అమరావతి ఇక్కడే ఉండేందుకు రైతులు చేసే పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

click me!