నీతి ఆయోగ్‌ సీఈవో‌తో చంద్రబాబు భేటీ.. ప్రధాని మోదీ సూచన మేరకే..!

By Sumanth KanukulaFirst Published Dec 6, 2022, 2:00 PM IST
Highlights

నీతి ఆయోగ్‌ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ప్రధాని మోదీ సూచన మేరకే చంద్రబాబు.. నీతి ఆయోగ్‌ సీఈవోను కలిసినట్టుగా తెలుస్తోంది.
 

నీతి ఆయోగ్‌ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు.. సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జీ20 సదస్సుపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశంపై చంద్రబాబు మాట్లాడారు. భవిష్యత్ తరాలకు డిజిటల్ నాలెడ్జ్‌పై దృష్టి సారించేందుకు కనీసం రాబోయే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 

అయితే చంద్రబాబు నాయుడు అభిప్రాయాలను అంగీకరించిన ప్రధాని మోదీ..  దీనిపై విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే డిజిటల్‌ నాలెడ్జ్‌ డాక్యుమెంట్‌పై చర్చించాలనే ప్రధాని మోదీ సూచన మేరకే.. చంద్రబాబు నీతి ఆయోగ్‌ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌‌తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. 

ఇక, ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చంద్రబాబు  మాట్లాడుతూ.. ‘‘మనం డిజిటల్ ప్రపంచాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటే’’ భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ లేదా నంబర్ టూ దేశంగా ఎదుగుతుందని అన్నారు. భారత్‌లో బలమైన యువశక్తి ఉందని.. వారి లక్ష్యసాధనలో వారిని ప్రోత్సహించాలన్నారు. యువతకు మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా విధానాలు రూపొందించాలని.. అప్పుడే మనం బాగా పురోగమిస్తామని అభిప్రాయపడ్డారు.

మానవ వనరుల శక్తిని నాలెడ్జ్ ఎకానమీతో అనుసంధానం చేయడం ద్వారానే ఉత్తమ ఫలితాలు సాధించగలమని చంద్రబాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు నిజంగా సంపద సృష్టికర్తలని, యువతను మరింత ప్రోత్సహించాలని కోరారు.

click me!