మాచర్ల హింస.. టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు ఫోన్ , అండగా వుంటామని భరోసా

By Siva KodatiFirst Published Dec 18, 2022, 8:03 PM IST
Highlights

పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అల్లర్లలో తీవ్రంగా నష్టపోయిన కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం ఫోన్ చేశారు. నష్టపోయిన కుటుంబాలను పార్టీ ఆదుకుంటుందని ... కేసుల విషయంలోనూ అండగా వుంటామని చంద్రబాబు భరోసా కల్పించారు.

పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం టీడీపీ, వైసీపీ నేతల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ మాచర్ల నివురుగప్పిన నిప్పులాగానే వుంది. ఈ నేపథ్యంలో మాచర్ల ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన టీడీపీ నేతలు, కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పోలీసుల అండతోనే తమపై, తమ ఇళ్లపై దాడులు జరిగాయని బాధితులు చంద్రబాబుకు వివరించారు. నష్టపోయిన కుటుంబాలను పార్టీ ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. కేసుల విషయంలోనూ పార్టీ అండగా వుంటుందని చంద్రబాబు భరోసా కల్పించారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని చంద్రబాబు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ దాడులకు జిల్లా ఎస్పీ సహకరించారని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇకపోతే.. మాచర్ల ఘటనపై స్పందించారు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాచర్ల ఘటనపై పల్నాడు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. అనుమతి లేకుండా టీడీపీ నేతలు కార్యక్రమాలు చేశారని.. ఫ్యాక్షన్ నేపథ్యం వున్న టీడీపీ కార్యక్రమంపై సమాచారం ఇవ్వలేదని డీఐజీ అన్నారు. ఇరువర్గాలు రాళ్ల దాడులు చేసుకున్నారని.. కేసులు పెట్టామని త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. క్యాడర్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం టీడీపీ నాయకులు చేశారని.. కార్లు, ఆస్తులపై ధ్వంసం చేశారని కఠిన చర్యలు వుంటాయని డీఐజీ హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. 

Also Read: ముందస్తు అనుమతి లేదు, క్యాడర్‌ను టీడీపీ నేతలు రెచ్చగొట్టారు : మాచర్ల ఘటనపై డీఐజీ

ఇదిలావుండగా.. మాచర్లలో మరో రెండు రోజుల పాటు 144 సెక్షన్ అమల్లో  ఉంటుందని  పోలీసులు  ప్రకటించారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అలాగే బ్రహ్మారెడ్డిని ఏ1గా చేర్చారు. రేషన్ డీలర్ చల్లా మోహన్ ఫిర్యాదుతో బ్రహ్మారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బ్రహ్మారెడ్డి, బాబూఖాన్‌లు తమపై రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని చల్లా మోహన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరో రాళ్లు విసిరితే తమపై దాడి చేశారని ఆయన ఫిర్యాదులో చెప్పారు. 

మరో కేసులో మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురక కిశోర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పార్టీ కార్యాలయంపై దాడి, కార్ల ధ్వంసం, అపార్ట్‌మెంట్‌లో చొరబడి చేసిన విధ్వంసాల కారణంగా తురక కిశోర్‌పై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 10 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా తురక కిశోర్, ఏ2గా చల్లా మోహన్‌లను చేర్చారు. ఎర్రం అన్నపూర్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. 

click me!