బంగారు బాతును చంపేస్తున్నారు: అమరావతి విషయంలో వైసీపీపై బాబు ఫైర్

By sivanagaprasad KodatiFirst Published Oct 22, 2019, 8:43 PM IST
Highlights

ప్రపంచమంతా అమరావతి గురించి చర్చించేలా చేశానని.. హార్వర్డ్ యూనివర్సిటీలో అమరావతిపై కేసు స్టడీ కూడా చేశారని ఆయన గుర్తుచేశారు. బంగారు గుడ్లు పెట్టే బాతును చేతికిస్తే దానిని చంపేస్తున్నారని.. తన పేరు గుర్తు చేసుకుంటారనే ఉద్దేశ్యంతోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. 

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.... రివర్స్ టెండరింగ్‌తో రూ.750 కోట్లు మిగిల్చామని వైసీపీ నేతలు చెబుతున్నారని.. కానీ రూ.7,500 కోట్లు నష్టం వస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రివర్స్ టెండరింగ్ కాదని... రిజర్వ్ టెండరింగ్ అంటూ సెటైర్లు వేశారు.

ప్రభుత్వం తమై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఆర్ధికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

తాను జీవితాంతం క్రమశిక్షణతో పనిచేశానని.. అదే తనకు శ్రీరామరక్ష అని బాబు వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా అమరావతి గురించి చర్చించేలా చేశానని.. హార్వర్డ్ యూనివర్సిటీలో అమరావతిపై కేసు స్టడీ కూడా చేశారని ఆయన గుర్తుచేశారు.

బంగారు గుడ్లు పెట్టే బాతును చేతికిస్తే దానిని చంపేస్తున్నారని.. తన పేరు గుర్తు చేసుకుంటారనే ఉద్దేశ్యంతోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తమను దెబ్బతీయాలని చూస్తే రాష్ట్రం మొత్తం ఏకం చేస్తామని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్ గ్రౌండ్ సిటీ అని.. అమరావతి గ్రీన్ సిటీ అన్నారు.. హైదరాబాద్‌లో వర్షం పడితే డ్రైన్లు పొంగుతాయని, కానీ అమరావతిలో ఏ సమస్యా తలెత్తదని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ స్థాయిలో మంచి నగరాన్ని నిర్మించాలనే ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం చంపేసిందని బాబు ఎద్దేవా చేశారు.

మరోవైపు యురేనియం పై పోరాడుతున్నందుకే ప్రభుత్వం తనపైనే కాదు మొత్తం కుటుంబంపై కక్షగట్టిందని మాజీ మంత్రి, టిడిపి నాయకురాలు భూమా అఖిలప్రియ ఆరోపించారు. తనపైనా, భర్తపైన వస్తున్న వదంతులపై ఆమె తాజాగా స్పందించారు.

దీనిపై కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ...పనిగట్టుకొని పోలీసులు తనను వేధిస్తున్నారంటూ మండిపడ్డారు.

యురేనియం పై తాను పోరాటం ప్రారంభించినప్పటినుండే వ్యూహాత్మకంగా తమను పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రయత్నంచేస్తున్నారంటూ ఆరోపించారు. తనకే కాదు కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఎలాంటి కీడు జరిగినా జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సి వస్తుందనిహెచ్చరించారు.

తన ఐదేళ్ల రాజకీయాల్లో చాలా నేర్చుకున్నానని అఖిల ప్రియ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడం ఓ రకంగా మంచిదే అయ్యిందన్నారు. ఈ ఓటమి తర్వాత మనవారు ఎవరో... మనల్ని ముంచే వారు ఎవరు అన్న సత్యం తెలుసుకున్నానని పేర్కొన్నారు. తన భర్త భార్గవ్‌ రామ్ కులం వల్ల తాను ఓడిపోయాననే వార్తలు తనను ఎంతగానో బాధించాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!