Operation Royal vasista: కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు.. ఎనిమిది గుర్తింపు

By Siva KodatiFirst Published Oct 22, 2019, 6:42 PM IST
Highlights

బోటు ఒడ్డుకు చేరిన వెంటనే అందులో చిక్కుకుపోయిన మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. గల్లంతైన 12 మృతదేహాల్లో ఇప్పటి వరకు 8 మందిని గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు

38 రోజుల పాటు గోదావరిలో చిక్కుకున్న రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం ఎట్టకేలకు మంగళవారం వెలికితీసింది. ఈ క్రమంలో తమ వారి కడసారి చూపు కోసం ఎదురుచూస్తోన్న ఆత్మీయుల్లో చిన్న ఆశ కలిగింది.

మరోవైపు బోటు ఒడ్డుకు చేరిన వెంటనే అందులో చిక్కుకుపోయిన మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. గల్లంతైన 12 మృతదేహాల్లో ఇప్పటి వరకు 8 మందిని గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు.

బోటు ప్రమాదం నుంచి బయటపడిన జానకి రామయ్య మాట్లాడుతూ.. సంఘటన విషాదకరమైనప్పటికీ.. ఇప్పటికైనా బోటు బయటకు రావడం సంతోషకరమన్నారు. బాధిత కుటుంబసభ్యులకు కడసారి చూపైనా దక్కిందని జానకిరామయ్య తెలిపారు.

Also Read: operation royal vasista: బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం టీమ్

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పరిహారం అందలేదని ఆయన ఆరోపించారు. ఎక్స్‌గ్రేషియాపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. కేవలం ప్రకటన మాత్రం చేసి పరిహారం మాట మరిచారని జానకిరామయ్య మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద పర్యాటకులతో వెళ్తున్న రాయల్ వశిష్ట బోటు గోదావరిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 73 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇంకా దాదాపు 14 మంది ఆచూకీ దొరకలేదు.

ఏసీ క్యాబిన్‌లో పలువురు ప్రయాణికులు చిక్కుకుని ఉంటారని భావించారు. మునిగిపోయిన బోటు వెలికితీత కోసం అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ధర్మాడి సత్యం బృందానికి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. 

Also Read:Royal Vashista Operation: బోటు వెలికితీతపై ధర్మాడి సత్యం స్పందన ఇదీ...

బోటును వెలికితీసే పనిని మంగళవారం నాడు ఉదయం ధర్మాడి సత్యం బృందం ప్రారంభించింది. సోమవారం నాడు రాయల్ వశిష్ట బోటు వెలికితీసే ప్రక్రియలో బోటు పై భాగం ముక్కలు బయటకు వచ్చాయి.

గోదావరి నదిలో ఇసుక పేరుకుపోవడంతో కూడ బోటు వెలికితీతకు కొంత ఇబ్బందులు చోటు చేసుకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.సోమవారం ఉదయం ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. రెండు రోప్‌ల మునిగిపోయిన బోటుకు కట్టి వెలుపలికి తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో బోటు పైకప్పు భాగాలు బయటకు వచ్చాయి.

రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు వెలికితీత పనులను కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్‌ వాటర్‌ సర్వీసెస్‌కు చెందిన పది మంది డైవర్లలో నాగరాజు, స్వామి అనే ఇద్దరు ఆదివారం ఉదయం 11 గంటలకు బోటు మునిగిన ప్రదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు.

దాదాపు 15 నిమిషాలపాటు ఆ ప్రాంతంలో బోటు ఎలా ఉంది? దాని చుట్టూ ఇసుక, మట్టి ఎంతమేర పేరుకుపోయాయి? బోటుకు ఎక్కడ తాడు బిగిస్తే పైకి రావడానికి అనువుగా ఉంటుందనే కోణంలో పరిశీలించి వచ్చి పోర్టు అధికారికి వివరించారు.  

Also Read:Operation Royal vasista: ధర్మాడి సత్యం బీ ప్లాన్ సక్సెస్, బోటు ఎలా తీశారంటే..

ఇలా 6 సార్లు డైవర్లు బోటు మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరిలో బోటు ఏటవాలుగా మునిగి ఉందని పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ విలేకర్లకు తెలిపారు. నదిలో బోటు ముందు భాగం 40 అడుగుల లోతులో ఉంటే, వెనుక భాగం దాదాపు 70 అడుగుల లోతులో ఉందని చెప్పారు. 

మంగళవారం నాడు ఉదయం నుండే బోటును వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బోటుకు ఇనుప రోప్ వేసి ప్రొక్లెయినర్ సహాయంతో బయటకు లాగనున్నారు. సోమవారం నాడు బోటు కొన్ని అడుగుల దూరం జరిగింది. ప్రొక్లెయినర్ తో లాగే క్రమంలో బోటు పైకప్పు విడిభాగాలు మాత్రమే బయటకు వచ్చాయి.

click me!