విజయవాడ బెంజిసర్కిల్‌లోని అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది
విజయవాడ బెంజిసర్కిల్‌లోని అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేదిక కల్యాణ మండపం వద్ద పరిరక్షణ సమితి కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణతో పాటు జేఏసీ నేతలు పాదయాత్రగా వెళ్లారు.
ఈ క్రమంలో నేతలను పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు వారితో వాగ్వాదానికి దిగారు. ప్రజలు తిరగబడితే ఏమి చేయలేరంటూ మండిపడ్డారు. అనంతరం చంద్రబాబుతో పాటు ఇతర నేతలంతా రోడ్డుపైనే బైఠాయించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నించారు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని... ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని బాబు నిలదీశారు.
Also Read:చంద్రబాబు అరెస్ట్: పీఎస్‌కు తరలించే వాహనం ‘కీ‘ మాయం, కదలని బండి
ఏ చట్టం ప్రకారం తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రతిపక్షనేత పోలీసులు తెలిపారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ బుధవారం బస్సు యాత్ర నిర్వహిస్తామని, అడ్డుకున్న బస్సులను వదలాలని టీడీపీ చీఫ్ పోలీసులను డిమాండ్ చేశారు.
అంతకుముందు బెంజ్ సర్కిల్‌లో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మీడియా మాట్లాడుతూ.. ప్రజల్ని చైతన్యం చేయడానికి జేఏసీ సిద్ధమైందన్నారు. ‘రాష్ట్రం కోసం' తమ వంతు బాధ్యతగా జేఏసీ ముందుకొచ్చిందని, అన్ని రాజకీయ పార్టీలను జేఏసీ ఏకతాటిపైకి తెచ్చిందన్నారు. రాజధానికి ఈ ప్రాంతం అనువైందని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని చంద్రబాబు గుర్తుచేశారు.
ఒక్క పిలుపుతో రైతులు 33వేల ఎకరాల భూములు ఇచ్చారని, మొదట ల్యాండ్ పూలింగ్ అంటే ఎవరికీ అర్థం కాలేదన్నారు. రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి నిధులు ఇచ్చారని, రూ.10 వేల కోట్లు ఖర్చుపెడితే అభివృద్ధి చేయలేదని అంటున్నారని ప్రతిపక్షనేత మండిపడ్డారు. రాజధానికి విజయవాడ సరైన ప్రాంతమని గతంలో జగన్ అన్నారని.. ఇప్పుడు జగన్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు.
Also Read:బెజవాడ: చంద్రబాబు సహా అమరావతి జేఏసీ నేతల అరెస్ట్, ఉద్రిక్తత
సీఎం మారితే రాజధాని మారిపోతుందా, అన్ని రాష్ట్రాల్లో ఇలాగే రాజధానులు మారిస్తే పరిస్థితి ఎలా ఉండేదన్నారు. కేసులు పెడతారని ప్రజలు భయపడుతున్నారని, లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడో బంగాళాఖాతంలో కలిపేవారని చంద్రబాబు అన్నారు. ఇంత మంది రైతులు చనిపోతే ఎందుకు పరామర్శించడం లేదని బాబు దుయ్యబట్టారు. రాజధాని ఏమైపోతుందన్న ఆవేదనతో రైతులు గుండెపోటుతో చనిపోయారని, వైసీపీకి చెందిన వ్యక్తి మరణించినా కుటుంబసభ్యులను పరామర్శించలేదని టీడీపీ చీఫ్ మండిపడ్డారు.
ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారన్న ఆయన.. ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటికిరాని మహిళలు ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మూడు రాజధానులు చేయాలని ఎవరడిగారని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధానిలో ఒకే కులం వారు ఉన్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
Also Read:Video : రాజధాని తరలిపోతుందని.. మనసు వికలమై..
కంపెనీలన్నీ వెనక్కి వెళ్తున్నాయి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని, అమరావతికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని మాజీ సీఎం తేల్చి చెప్పారు. మీరు ఏమీ చేయలేరని.. తాము వచ్చాక అమరావతిని పూర్తిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ప్రతిపక్షనేత డిమాండ్ చేశారు.
5 కోట్ల మంది ఒప్పుకుంటే రాజధానిని ఎక్కడైనా పెట్టుకోవచ్చునని, రాజధాని రెఫరెండంతో ఎన్నికలకు వెళ్లాలని బాబు సవాల్ విసిరారు. ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను గారు అని సంబోధిస్తే గాడు అని అన్నట్టుగా చిత్రీకరించారని, నాకు బూతులు మాట్లాడటం రాదని చంద్రబాబు స్పష్టం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు అసభ్యకరంగా మాట్లాడలేదని.. తనకు హుందాగా ఉండటమే వచ్చునని బాబు తెలిపారు.