టీడీపీ చలో నర్సీపట్నం.. ఇంటి వద్దే దీక్షకు దిగిన అయ్యన్న కుటుంబం.. టెన్షన్ వాతావరణం

Published : Jun 20, 2022, 12:19 PM IST
టీడీపీ చలో నర్సీపట్నం.. ఇంటి వద్దే దీక్షకు దిగిన అయ్యన్న కుటుంబం.. టెన్షన్ వాతావరణం

సారాంశం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత నేపథ్యంలో టీడీపీ నేడు చలో నర్సీపట్నంకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.   

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత నేపథ్యంలో టీడీపీ నేడు చలో నర్సీపట్నంకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ నేతలు నర్సీపట్నం బయలుదేరేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు.. పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దుగ్గిరాలలో చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  పక్క జిల్లాల నుంచి నర్సీపట్నంకు బయలుదేరిన పలువురు టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే కొందరు టీడీపీ నాయకులు పోలీసుల కళ్లుగప్పి గత రాత్రే నర్సీపట్నం చేరుకున్నారు. దీంతో ప్రస్తుతం నర్సీపట్నం‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

మరోవైపు  అయ్యన్న కుటుంబం ఇంటి వద్ద దీక్షలో కూర్చొంది. అయ్యన్నపాత్రుడి కొడుకు విజయ్.. నల్ల కండువాతో దీక్షలో కూర్చున్నారు. అయ్యన్న ఇంటి వద్దకు పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో నర్సీపట్నంలో వాతావరణం వేడేక్కింది. నర్సీపట్నం పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇక, వెనుకబడిన తరగతుల (బీసీ)లపై జరుగుతున్న హత్యలు,  దాడులకు నిరసనగా సోమవారం ‘చలో నర్సీపట్నం’ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటి కాంపౌండ్ వాల్‌ను అక్రమంగా కూల్చివేసిన అధికారులు అసత్య ప్రచారం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘‘అయ్యన్న ఇంటిని అధికారులు, పోలీసులను కలిసి కూల్చివేతలు చేసేలా చేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. గతంలో పల్లా శ్రీనివాస్, సబ్బం హరి వంటి టీడీపీ బీసీ నేతల ఆస్తులపై కూడా జగన్ ఇలాంటి దాడులు చేశారు’’ అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. ఆదివారం తెల్లవారుజామున అయ్యన్న ఇంటికి వెళ్లిన మున్సిపల్‌ సిబ్బంది.. ప్రహరీని పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేశారు. అయ్యన్నపాత్రుడు తన ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిలో రెండు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని మున్సిపల్ అదికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై నోటీసులు ఇచ్చినా ఆయన నుంచి స్పందన లేదని చెబుతున్నారు. అయ్యన్న స్పందించకపోవడంతోనే ప్రహరీ గోడ కూల్చివేత చేపట్టినట్లు వెల్లడించారు. అయితే కూల్చివేతను అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

ఇందుకు సంబంధించి అయ్యన్నపాత్రుడి కుమారులు హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై స్పందించి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అయ్యన్న ఇంటిని ముట్టవద్దని స్పష్టం చేసింది. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి కూల్చివేత ఏమిటని ప్రశ్నించింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్