గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు : పశ్చిమ రాయలసీమలో టీడీపీ లీడింగ్, వైసీపీ అభ్యర్ధి ఆరోపణలు

By Siva KodatiFirst Published Mar 18, 2023, 7:24 PM IST
Highlights

పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. దీనిపై వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల లెక్కింపులో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 
 

ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ క్షణక్షణానికి ఉత్కంఠ కలిగిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో ఓట్ల లెక్కింపు బీపీ తెప్పిస్తోంది. ఉదయం వరకు వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి ఇక్కడ లీడింగ్‌లో వుండగా.. తాజాగా టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. బీజేపీ అభ్యర్ధి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ అభ్యర్ధి ముందంజలో నిలిచారు. ప్రస్తుతం పీడీఎఫ్ అభ్యర్ధి నాగరాజు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. 

ప్రస్తుతం తెలుగుదేశం అభ్యర్ధి రామ్ గోపాల్ రెడ్డి 1009 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. అయితే కౌంటింగ్ తీరుపై వైసీపీ అభ్యర్ధి రవీంద్రా రెడ్డి , మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసింది వైసీపీకేనని, నైతిక విజయం తమదేనని వారు పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు తామే ఆధిక్యంలో వున్నామని.. బీజేపీకి వచ్చిన ఓట్లు షేర్ చేయడంతో టీడీపీ అభ్యర్ధికి లీడింగ్ వచ్చిందని వారు ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తామని, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్తామని వారు స్పష్టం చేశారు. 

ALso REad: ఎమ్మెల్సీ ఎన్నికలు సమాజం మొత్తాన్ని రిప్రజెంట్ చేసేవి కావు.. ఏదో మారిపోయిందని అనుకోవద్దు: సజ్జల

అనంతపురం జేఎన్‌టీయూలో గురువారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శనివారం కూడా కొనసాగుతోంది. 11 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. 2,45,687 ఓట్లు పోలవ్వగా వీటిలో 2,26,405 ఓట్లు చెల్లుబాటైనట్లుగా అధికారులు ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ గెలుపునకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు కొనసాగిస్తున్నారు. ఈ స్థానంలో 49 మంది అభ్యర్ధులు పోటీపడ్డారు. 


 

click me!