వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబును జైల్లో వుంచాలన్నది జగన్ వ్యూహమన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ కార్యక్రమాలేవీ స్తంభించలేదని, ప్రస్తుతానికి టీడీపీ జనసేనతో మాత్రమే పొత్తులో వుందని ఆయన పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబును జైల్లో వుంచాలన్నది జగన్ వ్యూహమన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును జైల్లో వుంచేందుకు గాను జగన్ హడావుడిగా ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ బీజేపీకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది దేవుడికి తెలియాలని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేతలు కనీసం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రస్తుతానికి టీడీపీ జనసేనతో మాత్రమే పొత్తులో వుందని ఆయన పేర్కొన్నారు.
ఇక లెఫ్ట్ పార్టీలతో పొత్తు వుంటుందా లేదా అన్న దానిపై చంద్రబాబు నిర్ణయిస్తారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ నెల 9 లోపు చంద్రబాబు విడుదలవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ చంద్రబాబు విడుదల ఆలస్యమైతే అక్టోబర్ 10 నుంచి వివిధ రూపాల్లో నిరసనలు చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ వార్త తెలిసి దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోయారని .. వారిని నారా భువనేశ్వరి త్వరలోనే పరామర్శిస్తారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ కార్యక్రమాలేవీ స్తంభించలేదని, ఓటర్ల జాబితాలో అక్రమాలపై అప్రమత్తంగా వున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.