విజయం దిశగా డీఎంకే... స్టాలిన్ కు సీఎం జగన్ అభినందనలు

By Arun Kumar PFirst Published May 2, 2021, 6:12 PM IST
Highlights

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఘనవిజయం దిశగా దూసుకుపోతున్న నేసథ్యంలో ఆ పార్టీ అధినేత స్టాలిన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

అమరావతి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత స్టాలిన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపట్ల డీఎంకే అధినేత స్టాలిన్ ఆనందం వ్యక్తం చేశారు. విజయం సాధించినప్పటికీ.. విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో కార్యకర్తలందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు కొనసాగుతోంది. ఇప్పటికే డీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతోంది. 141 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ డీఎంకే అధికారం చేపట్టే దిశగా సాగిపోతోంది.

 దీంతో, కార్యకర్తలు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను, పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు.. ‘‘పోల్‌ బూత్‌ వద్ద ఉన్న కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. విజయం ఖాయమని తెలుసు. అయితే, సంబరాలు చేసుకోవడం తగదు. మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. డీఎంకే సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. ముందు మనల్ని మనం కాపాడుకుంటేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలం కదా. అందుకే ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించండి’’అని పిలుపునిచ్చారు.

ఇక డీఎంకే నేత, ఎంపీ టీకేఎస్‌ ఎలంగోవన్‌ మాట్లాడుతూ... ‘‘డీఎంకే శ్రేణులు విజయోత్సవంలో మునిగిపోయాయి. అయితే, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త తమ ఇంట్లోనే సంబరాలు చేసుకోవాలి. డీఎంకే కుటుంబంలోని సభ్యులుగా మన అధినేత సూచనలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’’ అని పేర్కొన్నారు.

click me!