శ్రీహరి బతికి ఉంటే "జగన్" విషయంలో ఇలా జరిగేదికాదు: సినీపరిశ్రమపై పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Oct 13, 2019, 4:28 PM IST
Highlights

చంద్రబాబు నాయుడు గెలిస్తే చంకలు గుద్దుకుని మరీ విజయవాడ వెళ్లిన సినీ పెద్దలు జగన్ గెలిస్తే మాత్రం హైదరాబాద్ వదిలిరావడం లేదన్నారు. హైదరాబాద్ లో ఉన్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ లు చేయరా అని నిలదీశారు. 

అమెరికా: సినీ ఇండస్ట్రీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్విరాజ్. జగన్ సీఎం కావడం తెలుగు సినీ పెద్దలకు ఇష్టం లేదని విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన సినీపరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం జగన్ తో కలిసిరావాల్సిన అవసరం ఉందన్నారు. 

సినీ పరిశ్రమ నుంచి సీఎం జగన్ ఏమీ కోరుకోవడం లేదని కానీ సినీ పెద్దలు కనీసం ఆయనను కలవడానికి కూడా రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. సహజంగానే తెలిసినవాళ్లు ఏదైనా సాధిస్తే అభినందనలు తెలిపేందుకు మనం క్యూ కడతామని చెప్పుకొచ్చారు.

అలాంటిది జగన్ బ్రహ్మాండమైన మెజారిటీతో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని తెలిసికూడా కనీసం అభినందంచడానికి రాలేదన్నారు. ఎందుకంటే వారు అనుకున్న వ్యక్తి రాకపోవడంతోనే వారు నిరుత్సాహంలో ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గెలిచిఉంటే వారు సంతోషంగా ఉండేవారన్నారు. 

జగన్ ప్రమాణస్వీకారం చేసి నాలుగున్నర నెలలు అయ్యిందని ప్రజలు జగన్ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మూడు నెలల పాలన చాలా దారుణంగా ఉండేదని కానీ ఇప్పుడు జగన్ పాలనను ప్రజలు భేష్ అంటున్నారని చెప్పుకొచ్చారు. 

ఇప్పటికైనా సినీరంగానికి చెందిన ప్రజలు వివక్షను విడనాడాలని సూచించారు. సినీపరిశ్రమ అభివృద్ధికి సీని పెద్దలు, దర్శక నిర్మాతలు కలిసి చర్చించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు పృథ్వీరాజ్. 

చంద్రబాబు నాయుడు గెలిస్తే చంకలు గుద్దుకుని మరీ విజయవాడ వెళ్లిన సినీ పెద్దలు జగన్ గెలిస్తే మాత్రం హైదరాబాద్ వదిలిరావడం లేదన్నారు. హైదరాబాద్ లో ఉన్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ లు చేయరా అని నిలదీశారు. 

ఎన్నికల్లో ఎవరు ఓటమి చెందారు ఎవరు గెలిచారో అన్నవి పక్కన పెట్టి ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు. తాను ఏదైనా మాట్లాడుతుంటే తప్పు అని సినీదర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళీ అంటున్నారని తాను వాస్తవాలే మాట్లాడానన్నారు. 

నిర్మాతలు సి.కళ్యాణ్, సురేష్ బాబులు కలుస్తానని అన్నారని అంటున్నారని ఆ విషయంలో సి కళ్యాణ్ ప్రయత్నించిన మాట వాస్తవమేనన్నారు. శ్రీహరి చనిపోవడం తమ దురదృష్టకరమన్నారు. శ్రీహరి బతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అందరిని కలుపుకుపోయి బ్రహ్మాండగా మద్దతు పలికేవారన్నారు పృథ్వీరాజ్. 

తనకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయనను ఆదర్శంగా తీసుకునే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఎస్వీబీసీ చైర్మన్ పార్టీకి సేవ చేసినందుకు ఇచ్చారని అంతా అంటున్నారని అంతకంటే ముందు తనకు సినీ ఇండస్ట్రీ ఎంతో ఇచ్చిందన్నారు. 

తనకు అన్నంపెట్టిందే సినీ ఇండస్ట్రీ అని చెప్పుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న పృథ్వీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పలువురు పారిశ్రామిక వేత్తలను కోరారు ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్. 

click me!