ఓటుకు నోటు కేసులో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఈ నెల 4న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబును వరుస కేసులు ఇబ్బందులు పెడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులతో పాటు గతంలో తెలంగాణలో నమోదైన ఓటుకు నోటు కేసు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నెల 4వ తేదీన సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు లిస్టైంది. వైఎస్ఆర్‌సీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు.జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించే అవకాశం ఉంది.
2015 మే మాసంలో ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆ సమయంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వేంనరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకొనేందుకు బీఆర్ఎస్ కు చెందిన నామినేటేడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తనపై ఉద్దేశ్యపూర్వకంగా ఈ కేసును నమోదు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధం కూడ ఉందని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే ఈ కేసు విషయమై 2021 మే 27న ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ లో చంద్రబాబు పేరు లేదు.