పవన్, లోకేష్ లపై విద్యార్థి వ్యాఖ్యలకు జగన్ ముసిముసి నవ్వులు

By Nagaraju penumalaFirst Published Nov 15, 2019, 5:37 PM IST
Highlights

విద్యార్థినులు పవన్ కళ్యాణ్ పైనా, నారా లోకేష్ లపైనా సెటైర్లు వేస్తుంటే వేదికపై ఉన్న సీఎం జగన్, ఇతర మంత్రులు ముసిముసి నవ్వులు నవ్వారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని జగన్ చెప్పుకొచ్చారు. 

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ ఇసుక, ఇంగ్లీష్ మీడియం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇసుక, ఇంగ్లీషు మీడియం అంశాలను టార్గెట్ గా చేసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. 

ప్రతిపక్ష తెలుగుదేశం కంటే ముందుగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ విధివిధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. ఇసుక కొరత అంశంపై లాంగ్ మార్చ్ సైతం నిర్వహించారు.

ఇసుక, ఇంగ్లీషు మీడియం వంటి అంశాలతో ప్రభుత్వంపై విరుచుకుపడుతూ జనసేన పార్టీయే ప్రత్యర్థి పార్టీ అన్నంతగా విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలను గమనిస్తే పవన్ వర్సెస్ వైసీపీగా మారిపోయాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 

పవన్ తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే తిప్పికొట్టేందుకు జగన్ అండ్ కో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ అవంతి శ్రీనివాస్ లు పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.  

ఇకపోతే ఇంగ్లీషు మీడియం విషయంలో సీఎం జగన్ సైతం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నిస్తూ నిలదీశారు. పెద్దోళ్లపిల్లలే ఇంగ్లీషు మీడియం చదవాలా పేదోళ్ల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవకూడదా అంటూ నిలదీశారు. 

ఇదే అంశం ఇప్పుడు ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను కదిలించిందనే చెప్పాలి. ఈ విషయంలో సీఎం జగన్ కాస్త గట్టిగానే నిలబడ్డారు. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ, వెంకయ్యనాయుడలను సైతం వదలకుండా విమర్శలు చేస్తున్నారు. 

ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లీషు మీడియం తప్పని సరి అని చెప్పుకొచ్చారు. అలాగే తెలుగు కంపల్సరీ సబ్జెక్టు అంటూ కూడా క్లారిటీ ఇచ్చేశారు సీఎం జగన్. సినీనటులు, రాజకీయ నాయకులు పిల్లలు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవళ్లు ఎక్కడ చదువుతున్నారు అంటూ కడిగిపారేశారు. ఇంటర్ కూడా పాసవ్వని పవన్ తన పిల్లలను ఏ స్కూల్స్ లో చదివిస్తున్నారోనంటూ సెటైర్లు వేశారు. 

ఇకపోతే పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో తాను ఇంటర్ కూడా పాసవ్వలేదని చెప్పుకున్నారు. ఇదే విషయాన్ని ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసింది. నవంబర్ 14న ఒంగోలులో జరిగిన నాడు-నేడు కార్యక్రమంలో చిన్నారి తన ఆవేదనను వ్యక్తం చేసింది. 

సీఎం జగన్ ఇతర మంత్రులు ఉన్న వేదిక సాక్షిగా తన ఆవేదన వెలబుచ్చింది. ఇంటర్ కూడా పాసవ్వని పవన్ కళ్యాణ్ మీరెవరు మాకు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నారా లోకేష్ సైతం ఇంగ్లీషు మీడియం వద్దు అంటున్నారని వారికేం సంబంధం అంటూ నిలదీసింది.  

అసలు తెలుగు చదవడం రాని లోకేష్ ఇంటర్ కూడా పాసవ్వని పవన్ కళ్యాణ్ లు ఎవరు మాకు ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఏం పాపం చేశామని నిలదీసింది. 

మీ పిల్లలు, కుటుంబ సభ్యులు దేశ విదేశాల్లో కోట్లు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంగ్లీషు మీడియంలో చదివించుకుంటున్నారని తాము చదువుకుంటే తప్పా అని నిలదీసింది. అంతకుముందు మరో విద్యార్థి అయితే జగన్ ను పొగడ్తలతో ముంచెత్తింది. 

విద్యార్థులను, విద్యార్థుల భవిష్యత్ ను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని సీఎం జగన్ కు తెలియజేసింది. తమకు ఓటు హక్కులేదనో లేదో తెలియదు గానీ తమను పట్టించుకోలేదని జగన్ సీఎం అయిన తర్వాత తమకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు.  

విద్యార్థినులు పవన్ కళ్యాణ్ పైనా, నారా లోకేష్ లపైనా సెటైర్లు వేస్తుంటే వేదికపై ఉన్న సీఎం జగన్, ఇతర మంత్రులు ముసిముసి నవ్వులు నవ్వారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని జగన్ చెప్పుకొచ్చారు. 

అయితే విద్యార్థినులు నేతలను టార్గెట్ చేసుకుని బహిరంగ వేదికలపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ అమ్మాయే అలాంటి వ్యాఖ్యలు చేసిందా లేక ఎవరైనా ప్రోత్సహించి చెప్పించారా అన్న చర్చ జరుగుతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

మీడియం రగడ: చంద్రబాబు, పవన్ లపై రోజా ఆగ్రహం

ఇంగ్లీష్ మీడియం చదువులు మీ పిల్లలకే నా ? పేద పిల్లలకు వద్దా..!: సీఎం జగన్

ఏపీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం: అమలుకు స్పెషల్ ఆఫీసర్

click me!