Student Attack on Lecturer: ఉపాధ్యాయులు, లెక్చరర్లు అంటే నేటి తరం విద్యార్థులకు అసలు లెక్కలేదు. వారిపై జోకులు వేయడం, వారి మాట అంటే లెక్కచేయకపోవడం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లలను గారాభంగా పెంచడంతోనే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు అంటున్నారు. రీసెంట్‌గా విజయనగరంలో జిల్లా బీటెక్ విద్యార్థిని లెక్చరర్ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రస్తుతం బిగ్ ట్విస్ట్ జరిగింది.
ఇటీవల విజయనగరం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు స్కూల్లో పిల్లలు మాట వినడం లేదనే ఆవేదనతో.. గుంజీలు తీసి, పొర్లుదండాలు పెట్టి.. మీకు మేము పాఠాలు చెప్పలేకపోతున్నాం క్షమించమని వేడుకున్నాడు. ఆ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై ఉపాధ్యాయుల్లో పెద్దఎత్తున చర్చకూడా నడిచింది. ఘటనపై ఏకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈక్రమంలోనే విజయనగరం జిల్లాలో బీటెక్ చదివే విద్యార్థిని లెక్చరర్ని చెప్పుతో కొట్టింది. ఇది కూడా వైరల్ అయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం జిల్లాలోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థికి లెక్చరర్‌కి మధ్య తరగతి గదిలో వాగ్వాదం జరిగింది. క్లాస్ జరుగుతుండగా.. విద్యార్థిని ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతోంది. దీన్ని గమనించిన లెక్చరర్ ఆ ఫోన్‌ను తీసుకున్నారు. తిరిగి ఇవ్వమన్నా ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థిని క్లాస్ అయిన తర్వాత మహిళా లెక్చరర్‌తో గొడవపడింది. లెక్చరర్‌పై బూతులు తిడుతూ ఫోన్ ఇచ్చేయాలని వార్నింగ్ ఇచ్చింది. చెప్పుతో కొడతా అని విద్యార్థిని అంటూ.. లెక్చరర్ చెంపపై చెప్పుతో కొట్టేసింది. ఈ దృశ్యాలను ఓ విద్యార్థి తన సెల్‌ఫోన్‌లో రికార్డ్‌చేసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. విద్యార్థినిది విశాఖపట్నం అని రోజూ కళాశాల బస్సులో వస్తుందని తొటి విద్యార్థులు చెబుతున్నారు. అసలు ఆమె అలా ప్రవర్తించిందో కూడా తమకు అర్థం కాలేదని అంటున్నారు.
ఘటన జరుగుతున్న సమయంలో చాలా మంది విద్యార్థులు ఉన్నాకూడా.. లెక్చరర్ పై దుర్బాషలాడింది ఆ విద్యార్థిని. సెల్ ఫోన్ ఖరీదు పన్నెండు వేలు, నా ఫోన్ ఎందుకు తీసుకుంటున్నావ్ అని లెక్చరర్‌కి వార్నింగ్ ఇచ్చింది. చివరికి మెరుపు వేగంతో లెక్చరర్ వద్దకు వెళ్లి చెప్పుతో కొట్టేసింది. హఠాత్తుగా జరిగిన పరిణామానికి లెక్చరర్‌కి తోటి విద్యార్థులకు ఏమి చేయాలో కూడా తెలియలేదు. చెప్పుతో కొట్టడంతోపాటు.. లెక్చరర్
జుట్టు పట్టుకుని కొట్టడానికి ప్రయత్నించింది. ఈలోపు విద్యార్థులు, తోటి లెక్చరర్లు అక్కడికి చేరుకుని ఇద్దరిని వారించి గొడవను అడ్డుకున్నారు.
లెక్చరర్‌పై దాడిని రఘు కాలేజి యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. ఘటనపై సమగ్రంగా విచారించి చర్యలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యార్థిని కళాశాల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై విద్యార్థిని ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.