
పీఆర్సీకి (prc) సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో (ap govt) ఉద్యోగుల వార్ మరింత ముదిరింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఉద్యోగుల సమ్మె మొదలుకాక ముందే రాష్ట్రంలో హీట్ పెరుగుతోంది. కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, వైద్యారోగ్యశాఖ ఉద్యోగులతో పాటు అత్యవసర సేవల విభాగాలు సమ్మెలో పాల్గొంటామని తెలిపాయి. మరోవైపు ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు గత నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నామని.. ఇక మీదట ఎదురుచూపులు ఉండబోవని మంత్రుల కమిటీ ప్రకటించడం దుమారం రేపుతోంది. ఒకవేళ ఉద్యోగ సంఘాలే తమను పిలిస్తే అప్పుడు చర్చలకు వెళ్తామని మంత్రులు వెల్లడించారు. అయితే పీఆర్సీపై విడుదలైన జీవోలు రద్దు చేసే వరకు చర్చలు జరిపేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు.
మరోవైపు కొత్త పీఆర్సీ ప్రకారం.. ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రయత్నాలను ఏపీ సర్కార్ వేగవంతం చేసింది. ఉద్యోగుల బిల్లులకు సంబంధించిన ట్రెజరీ సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ కొత్త జీతాలు చెల్లించేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నేడు, రేపు కూడా బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు 25 శాతం మంది ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రాసెస్ చేసినట్టు సమాచారం. పోలీస్ శాఖతో పాటు, కోర్టు ఉద్యోగుల బిల్లులే ట్రెజరీలకు చేరినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వ వ్యూహానికి కౌంటర్‌గా ఎత్తు వేసింది పీఆర్సీ సాధన సమితి. డీడీవోలకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని ఉద్యోగులు లేఖలు ఇచ్చారు.
మరోవైపు పీఆర్సీ సాధన సమితి, మంత్రుల కమిటీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించినా, ఉద్యోగులు ముందుకు రాకపోవడం సరికాదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). ఉద్యోగుల్లో అపోహలు మరింత పెరగకూడదనే ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిందని సజ్జల గుర్తుచేశారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన హితవు పలికారు.
మరోవైపు PRC సాధన సమితితో చర్చల కోసం ఎదురు చూపులుండవని ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తేనే చర్చలుంటాయని ఆయన తేల్చి చెప్పారు. చర్చల కోసం ఉద్యోగ సంఘాల కోసం ఎదరు చూపులుండవని ఆయన స్పష్టం చేశారు. మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారంగా ఏ ఒక్కరికి కూడా రూపాయి తగ్గదని మంత్రి తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని బొత్స సత్యనారాయణ కోరారు.
అయితే చర్చలకు రాలేదన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను ఏపీ ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఖండించారు. తొమ్మిది మంది ప్రతినిధులను చర్చలకు పంపించామని తెలిపారు. జీవోలను పక్కనపెట్టి పాతజీతాలు ఇవ్వమని అడిగామని , వారిని అవమానం చేశారని బొప్పరాజు వాపోయారు. మంత్రుల స్థాయిలో ఉన్నవారు అబద్దాలు మాట్లాడొద్దని హితవు పలికారు. 3 నెలల నుంచి చర్చల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని వెంకటరామిరెడ్డి ఆరోపించారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 3న లక్షమందితో 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుదలతో వున్నారు. అటు ప్రభుత్వం సైతం ఉద్యోగుల సమ్మెను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలోగా వారిని నయానో, భయానో బుజ్జగించాలని పావులు కదుపుతోంది.