వాటర్ ట్యాంకులో విషం కలిపిన ఫిరాయింపు నేత

By ramya neerukondaFirst Published Aug 23, 2018, 11:28 AM IST
Highlights

శ్రీను.. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరాడు. ఈ పార్టీ మార్పు విషయంలోనే కొందరు కాలనీవాసులతో శ్రీను గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

కాలనీవాసులంతా తాగే మంచినీటిలో ఓ ఫిరాయింపు నేత విషం కలపడం నూజివీడులో కలకలం రేపింది. కాగా.. ఈ విషయాన్ని గ్రహించిన కొందరు యువకులు కాలనీవాసులను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నూజివీడులోని బత్తులవారి గూడెం ఎస్సీ కాలనీ వాటర్‌ ట్యాంకులో మాజీ సర్పంచ్‌ భూక్యా శ్రీను బుధవారం పెట్రోల్‌తో కూడిన క్రిమి సంహారక మందును కలపటం సంచలనం రేకెత్తించింది. ఈ సంఘటనపై రాత్రి 8 గంటలకు నూజివీడు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కొందరు యువకులు ఫిర్యాదు చేశారు. 

బక్రీద్ సందర్భంగా బుధవారం సెలవు దినం కావడంతో కొందరు యువకులు సెల్ఫీలు దిగేందుకు వాటర్‌ ట్యాంకు ఎక్కారు. ఈ నేపథ్యంలో శ్రీను మద్యం తాగి వాటర్‌ ట్యాంకు వద్దకు చేరుకుని, పైన ఉన్న యువకులనుద్దేశించి దుర్భాషలాడుతూ వాటర్‌ ట్యాంకు పైకి చేరుకున్నాడు. తాను ఈ నీళ్లలో పెట్రోల్‌, ఏండ్రిన్‌ (క్రిమిసంహారక మందు) కలుపుతున్నానంటూ ముందుకు వెళ్లబోయాడు. వాటర్‌ ట్యాంకుపై ఉన్న యువకులు క్రిమిసంహారక మందును వాటర్‌ ట్యాంకులో కలపొద్దని ఎంత వారించినా శ్రీను వారిని దుర్భాషలాడుతూ తోసివేసి ట్యాంకుపై మూత తీసి కలిపేశాడు. అంతేకాకుండా ఈ ఎస్సీ కాలనీలో రాత్రికి ఎవడో ఒకడు ఈ నీటిని తాగి చస్తాడని యువకులను బెదిరించాడు.
 
ఆ యువకులు వెంటనే కాలనీవాసులను అప్రమత్తం చేశాడు. దీంతో.. ఎవరూ ఆ నీరు తాగలేదు. వెంటనే ఆ యువకులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు శ్రీను.. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరాడు. ఈ పార్టీ మార్పు విషయంలోనే కొందరు కాలనీవాసులతో శ్రీను గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

click me!