రేపు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక : నా తల్లిని కిడ్నాప్ చేశారు.. ఎమ్మెల్యే ఆర్కేపై వైసీపీ నేత కుమారుడు ఆరోపణలు

Siva Kodati |  
Published : May 04, 2022, 06:00 PM IST
రేపు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక : నా తల్లిని కిడ్నాప్ చేశారు.. ఎమ్మెల్యే ఆర్కేపై వైసీపీ నేత కుమారుడు ఆరోపణలు

సారాంశం

గురువారం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వైసీపీ మహిళా నేత కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. దుగ్గిరాల 2 ఎంపీటీసీగా గెలిచిన త‌న త‌ల్లి ప‌ద్మావ‌తిని ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేశారని యోగేందర్ నాథ్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు.   

ఏపీలో అధికార వైసీపీకి (ysrcp) చెందిన కీల‌క నేత‌, గుంటూరు జిల్లా (guntur district) మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే (mangalagiri mla) ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిపై (alla rama krishna reddy) సొంత పార్టీకి చెందిన మ‌హిళా ఎంపీటీసీ కుమారుడు సంచ‌ల‌న ఆరోప‌ణలు చేశారు. దుగ్గిరాల ఎంపీపీ (duggirala mpp election) ఎన్నిక నేప‌థ్యంలో దుగ్గిరాల 2 ఎంపీటీసీగా గెలిచిన త‌న త‌ల్లి ప‌ద్మావ‌తిని ఎమ్మెల్యే ఆర్కే అనుచ‌రులు అప‌హ‌రించార‌ని యోగేంద‌ర్ నాథ్ అనే యువకుడు ఆరోపిస్తున్నారు. గురువారం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యే ఆర్కేపై ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు రావ‌డం జిల్లాలో చర్చనీయాంశమైంది.

ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో చ‌తికిల‌బ‌డిన టీడీపీ (tdp) దుగ్గిరాల‌లో మాత్రం సత్తా చాటింది. అయితే అనూహ్య ప‌రిణామాల నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక వాయిదా ప‌డింది. తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఎంపీపీ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక గురువారం నాడు జ‌ర‌గ‌నుంది. దుగ్గిరాలలో మెజారిటీ ఎంపీటీసీల‌ను టీడీపీ గెలుచుకున్నా... ఎక్స్ అఫీసియో ఓట్ల‌తో ఎంపీపీ ప‌ద‌విని కైవ‌సం చేసుకునేందుకు వైసీపీ పావులు కదుపుతోంది.

ఇలాంటి త‌రుణంలో ఎంపీపీ ప‌ద‌విని ఆశిస్తున్న ప‌ద్మావ‌తికి వైసీపీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌లేదు. ఆమెకు బదులు మరో అభ్య‌ర్థిని ఎంపీపీగా ఎన్నిక చేసేందుకు వైసీపీ స‌న్నాహాలు పూర్తి చేసింది. దీంతో రెబ‌ల్‌గా అయినా పోటీ చేసేందుకు ప‌ద్మావ‌తి సిద్ధ‌మ‌య్యార‌న్న వార్త‌లు పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ప‌ద్మావ‌తిని ఆర్కే అనుచ‌రులు అపహరించారని ఆమె కుమారుడు యోగేంద‌ర్ నాథ్ ఆరోపిస్తున్నారు. త‌న త‌ల్లికి ఎంపీపీ ప‌ద‌విపై ఆశ లేద‌ని చెప్పిన యోగేంద‌ర్‌... త‌న త‌ల్లి ఎక్క‌డుందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. త‌న త‌ల్లికి ఏదైనా జ‌రిగితే ఎమ్మెల్యే ఆర్కేతో పాటు దుగ్గిరాల ఎస్సైలే బాధ్యత వ‌హించాల్సి ఉంటుంద‌ని యోగేంద‌ర్ నాథ్ హెచ్చ‌రించారు.

దుగ్గిరాల మండల పరిషత్‌ కార్యాలయంలో  గురువారం 10గంటలకు కో ఆప్షన్‌ సభ్యుడి పదవికి నామినేషన్ల దాఖలు, మధ్యాహ్నం 12 గంటల లోపు నామినేషన్ల పరిశీలన, ఒంటిగంట తరువాత నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం కో ఆప్షన్‌ సభ్యుని ఎన్నిక జరుగుతుందని ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ, ఇద్దరు వైస్‌ ఎంపీపీల ఎన్నికతో ఈ ప్రక్రియ ముగియనుందని చెప్పారు. ఈ ఎన్నికల టర్నింగ్‌ అధికారిగా తాడేపల్లి ఎంపీడీఓ రామ్ ప్రసన్న వ్యవహరించనున్నారు. గురువారం ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, టీడీపీ, జనసేన అభ్యర్థులకు పటిష్ట భద్రత కల్పించాలని డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 

మంగళగిరి నియోజవర్గం కావడంతో..
దుగ్గిరాల మండలం మంగళగిరి నియోజవర్గంలో ఉండటంతో ఈ ఎన్నికపై మరింత ఉత్కంఠ నెలకొంది. మంగళగిరి ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండగా.. సీఎం జగన్ నివాసం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. మరోవైపు మంగళగిరి టీడీపీ ఇంచార్జ్‌గా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) ఉన్నారు. దీంతో ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీపీ పీఠాన్ని ఎవరూ కైవసం చేసుకుంటారనేదానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. 

టీడీపీ నుంచి అభ్యర్థి లేకపోవడంతో ఆ పార్టీ.. ఏ రకమైన వ్యుహాన్ని అనుసరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. లోకేష్ ఇంచార్జ్‌గా ఉన్న నియోజకవర్గం కావడంతో ఆయన ఏ వ్యుహాంతో ముందుకు వెళ్తారనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇక, పార్టీ ఆదేశాలకు కట్టుబడి వ్యహరించాలని తమ పార్టీ ఎంపీటీసీలకు టీడీపీ విప్ జారీ చేసింది. విప్ జారీ చేసిన పత్రాలను ఎన్నికల రిట్నరింగ్ అధికారి రామ్ ప్రసన్నకు అందజేసినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎంపీపీ స్థానాన్ని గెలుచుకోపోబోతున్నామని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu